YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతలో షాడో ఎమ్మెల్యేల... కాసుల లెక్కలు

అనంతలో షాడో ఎమ్మెల్యేల... కాసుల లెక్కలు

అనంతపురం, జూలై 12,
రాజ‌కీయాల్లో కాలం క‌లిసివ‌స్తే బాగా అదృష్టం ప‌ట్టిన‌ట్టే. కానీ తాను స్వ‌యంగా ఎలాంటి పొర‌పాట్లూ చేయ‌క‌పోయినా ఆయ‌న పేరు అడ్డు పెట్టుకుని సోద‌రులు ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటే మాత్రం చెడ్డ‌పేరు వ‌చ్చేది ఆ నాయ‌కుడికే గాని త‌మ్ముళ్లకు కాదు. వాళ్లు తేలిగ్గా త‌ప్పించు కుంటారు. దేశంలో రాజ‌కీయ‌ నాయ‌కులు చాలామందికి బంధువులు, సోద‌రుల‌తోనే ఇబ్బందులు వుంటాయి. మ‌నోడు ఎమ్మెల్యే, మంత్రి అని చెప్పుకుని నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రి మీదా పెత్తనం చెలాయించ‌డం చూస్తూనే వుంటాం. వింటూనే వుంటాం. ఇది ఒక్కోసారి స‌ద‌రు మంత్రి లేదా ఎమ్మెల్యేకు భ‌రించ‌లేని భార‌మ‌యి ప‌దవికే ఎస‌రు పెడుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని పెనుగొండ రాజ‌కీయాల్లో  మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంక‌ర నారాయ‌ణ ప‌రిస్థితి సరిగ్గా ఇలాంటిదే. పెనుగొండ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నారాయణది పెనుగొండ నియోజక వర్గం. ఇక్కడ తాను మొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా.. వెంటనే అదృష్టం కలసి వచ్చింది. 2019 జగన్ మొదటి క్యాబినెట్ విస్తరణలో ఛాన్స్ కొట్టేసారు. సామాజిక సమీకరణాలు అప్పట్లో ఆయనకు బాగా కలసి వచ్చాయి. ఎమ్మెల్యే టికెట్ రాక ముందు జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన శంకర్ నారాయణపై పెద్దగా విమర్శలు లేవు. అయితే మంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి జిల్లాలో వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా మారారు. అధిష్టానం వరకు పిర్యాదులు వెళ్లేలా వ్యవహరించారు.అసలు ఆయన అలా కావడానికి ఆయన ప్రత్యక్ష కారణం కాదు. అంతా ఆయన సోదరులే చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. పార్టీ నాయకుల కోపం, ఆగ్రహం అంతా శంకర్ నారాయణ సోదరులపైనే అంటూ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.శంకర్ నారాయణకు ఇద్దరు సోదరులు  రవి, మల్లికార్జున్. మంత్రి అయ్యాక శంకర్ నారాయణ పూర్తిగా బిజీ బిజీగా గడిపేవారు. దీంతో నియోజకవర్గ స్థాయి పెత్తనం సోదరుల చేతిలోకి వెళ్లింది. చేతిలో అధికారం ఉంది కదా అని రవి మరింత దూకుడుగా వెళ్లేవారట. రాజకీయ కార్యక్రమాల్లోనే కాకుండా అధికారిక కార్యక్రమాలలో సైతం జోక్యం చేసుకొవ‌డం ఎక్కువ‌యింది. ఆ విధంగా నియోజకవర్గంలో మొత్తం పట్టుసాధించార‌ని కూడా చెబుతుంటారు. పెనుకొండలో చీమ చిటుక్కుమన్నా.. ఏ పని జరగాలన్నా శంకర నారాయణ సోదరులకు తెలియాల్సిందే. ఈ వైఖరి కొత్తలో బాగానే ఉన్నా రాను రాను శ్రుతిమించినట్టు చెబుతున్నారు. ఫలితంగా వైసీపీ లోకల్ లీడర్సే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది.మంత్రిగా శంకర్ నారాయణ కొనసాగినంత కాలం పార్టీ నేతలు., కార్యకర్తలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మంత్రివర్గం నుంచి శంకర్ నారాయణను తప్పించిన తరువాత వ్యతిరేకులంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ శంకర్ నారాయణ అన్నదమ్ముల్లో మార్పు రాలేదని టాక్. తాజాగా ఒక ఉద్యోగిని విషయంలో మాజీ మంత్రి సోదరులు వ్యవహరించిన విధానం వివాదాస్పదంగా మారింది. పెనుకొండ ఎంపిడిఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక ఉద్యోగిని బదిలీపై పరిగి మండలానికి వచ్చారు.జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వబోతుంటే, అక్కడి ఎంపీడీవో షాక్ ఇచ్చారట. ముందుగా వెళ్లి శంకర నారాయణ సోదరుల పర్మిషన్ తీసుకోవాలని.. ఆ తర్వాత డ్యూటీలో చేరాలని చెప్పారని సమాచారం. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ఆ మహిళా ఉద్యోగి భర్త కూడా వైసీపీ నాయకుడే. ఆయన శంకర నారాయణ వ్యతిరేక వర్గం కావడంతోనే అలా చేశారని నియోజవర్గంలో వార్త గుప్పుమంది. ఆ వర్గ పోరు కారణంగా ఆ ఉద్యోగినికి అక్కడ పోస్టింగ్ క్యాన్సిల్ చేసి మడకశిర పంపేశార‌ని స‌మాచారం.

Related Posts