గాంధీనగర్, జూలై 12,
ఎన్నికల్లో గెలిచేందుకు సోషల్ మీడియా సేవలను విస్తృతంగా ఉపయోగించుకునే బీజేపీ తాజాగా భారీ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. గుజరాత్ లో రాబోయే ఎన్నికల్లో ఈ సరికొత్త ప్లాన్ ను అమలు చేయబోతుంది. ఈ విధానం వల్ల ఎన్నికలు జరిగిన సాయంత్రం నాటికి పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోందో ఓ అంచనాకు వచ్చేలా కసరత్తు వేగవంతంగా జరుగుతోంది. గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఇప్పటికే సోషల్ మీడియా వింగ్ హైపర్ యాక్టివ్ గా ఉండగా.. తాజాగా ఓటర్ల నాడిని పట్టుకునేందుకు బీజేపీ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 'ప్రెసిడెంట్ డ్యాష్ బోర్డ్' పేరుతో తయారు చేసిన ఈ యాప్ ను గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఇటీవలే ఆవిష్కరించారు.పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను ఈ యాప్ లో పొందుపరుస్తారు. ప్రతి బూత్ ఇన్‌చార్జి తన ప్రాంతంలోని ఇంటిని సందర్శించి కుటుంబంలోని సభ్యులు, పుట్టిన తేదీ, వివాహ వార్షికోత్సవాలు మరియు వారు ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందారా? వారు ఏ పార్టీ భావాల పట్ల అనుకూలంగా ఉన్నారు? అనే సమాచారాన్ని సేకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ డేటా బీజేపీ పార్టీ సర్వర్‌తో అనుసంధానం చేయబడుతుంది. యాప్ ద్వారా సేకరించిన ఈ సమాచారాన్ని పార్టీ పెద్దలు ఎప్పుడైనా యాక్సెస్ చేయగలరు. ప్రజల నాడిని అంచనే వేసి అందుకు అనుగుణంగా పథకాల హామీ ఉండేలా ప్రణాళికలు వేస్తారని రాష్ట్ర బీజేపీ మీడియా కోఆర్డినేటర్ యగ్నేష్ దవే తెలిపారు. దేశంలో రాజకీయ పార్టీ ఇలాంటి అప్లికేషన్ ఉపయోగించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని ఓటర్ల వివరాలను, వారి అభిప్రాయలను సేకరించడంతో పాటు పోలింగ్ రోజు బూత్ ఇన్ ఛార్జ్ లు అదే యాప్ లో బూత్ వెలుపల కూర్చుని ఓటు వేయడానికి వచ్చిన వారిని టిక్ మార్క్ చేసుకుంటారు. ఎవరెవరూ ఓట్లు వేశారు. రాజకీయ పార్టీల పట్ల సదరు ఓటర్లు ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇలాంటి డేటాను యాప్ లో క్రోడీకరించి సాయంత్రం నాటికి ఎవరు గెలుస్తారో అంచనా వేయబోతోంది బీజేపీ. ప్రస్తుతం ఆయా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. అయితే సంస్థాగతంగా సొంత సర్వే మాదిరిగా బీజేపీ ఈ యాప్ సేవలను ఉపయోగించుకోబోతోంది. గుజరాత్‌లో ప్రస్తుతం 1.13 కోట్ల మంది బీజేపీ సభ్యులు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పార్టీని మరింత యాక్టివ్ చేసేలా రాష్ట్ర యూనిట్ తాజాగా ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. అలాగే కొత్త ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కోసం థీమ్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు.గుజరాత్ లో అనుసరిస్తున్న ఈ విధానం వర్కౌట్ అయితే గనుక దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అమలుచేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ నజర్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ప్రెసిడెంట్ డ్యాష్‌బోర్డ్' యాప్ సేవలను తెలంగాణలో ఉపయోగిస్తే బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయం ఆ పార్టీ నేతలు ఓ అంచనాకు రావచ్చు. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గెలుపు పోలింగ్ రోజు సాయంత్రానికే ఓ అంచనాకు వచ్చే వీలుండటంతో రాబోయేది ఏ పార్టీ ప్రభుత్వం అనేదానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక వేళ హంగ్ లాంటి పరిస్థితే వస్తే ఏ పార్టీని సంప్రదించాలనేదానిపై కూడా ఈ యాప్ సర్వే ఆధారంగా అంచనా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.