పర్యాటకానికి చుక్కెదురైంది. వేసవి సీజన్ లో అదిరిపోయే పాపికొండల పర్యాటకం లాంచీ ప్రమాదాలతో లంగరేసింది. పదివేలమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి నడుస్తున్న ఈ పర్యాటకం దెబ్బతినడంతో దీనిపై ఆధారపడిన వారు దిక్కుతోచని పరిస్థితిలో నలిగిపోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే పాపికొండలు కనుమరుగు అవుతాయంటూ సాగిన ప్రచారంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో పర్యాటకం ఊపందుకుంది. దేశ విదేశాలనుంచి పర్యాటకుల ఈ అందాలను ఆస్వాదించడానికి రావడం మొదలు పెట్టారు.పర్యాటకులకు గిరిజనులకు, పర్యాటకులకు మొదట్లో వున్న లాంచీ. ఆ తరువాత పోలవరం ప్రాజెక్ట్ కి వైఎస్ సర్కార్ పనులు మొదలు పెట్టాక పాపికొండలు ఉంటాయా? ఉండవా? డ్యామ్ లో కలిసి పోతాయా? అంటూ చర్చ మొదలైంది. అదే గోదావరి జిల్లాలో పాపికొండల టూరిజాన్ని మలుపు తిప్పింది. శీతాకాలంలో మాత్రమే అత్యధిక శాతం పర్యాటకులు రావడం మొదలైంది. లాంచీలకు పర్యాటక కార్యాలయాలకు క్రమంగా డిమాండ్ పెరిగింది. పర్యాటకుల డిమాండ్లకు అనుగుణంగా ఏ సీజన్ లో అయినా పర్యాటకులు పర్యటించేలా ఏసీ బొట్లు వచ్చేశాయి. అంతే ఇక అప్పటినుంచి పాపికొండల పర్యాటకానికి తిరుగు లేకుండా పోయింది. వందలు, వేలసంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి లభించింది.సరైన పర్యవేక్షణ లేకపోవడం టూరిజం ఆపరేటర్లు నిబంధనలు పాటించకపోవడం ఎంతో ఎత్తుకు ఎదిగిన పాపికొండల పర్యాటకానికి శాపంగా పరిణమించింది. గత పదేళ్లుగా ఈ పర్యాటక కార్యక్రమంలో ఎప్పుడు అపశ్రుతి దొర్లినా తిరిగి టూరిజం పుంజుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. ఇటీవల ఒక బోట్ లో అగ్నిప్రమాదం సంభవించడం, ఆ తరువాత గిరిజనులు ప్రయాణిస్తున్న ఒక లాంచీ సుడిగాలి నదిలో నీట మునగడం వంటి సంఘటనలతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి భయపడే పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు ప్రమాదాలు జరిగిన తరువాత స్పందించే ప్రభుత్వం నిబంధనలపై ఒక్కసారిగా పిడికిలి బిగించడం వల్ల కూడా ఎక్కడి బోట్ లు అక్కడే నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి లోని లాంచీలు, బోట్ లు నది ఒడ్డునే ఉండిపోవడంతో వీటిపై ఆధారపడిన వారు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు.అత్యంత ఆహ్లాదకర పాపికొండలు పర్యాటకంపై ప్రభుత్వం మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలిసిన అవసరం వుంది. ఎపి విభజన తరువాత వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా వున్న సర్కార్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై చర్యలు వేగవంతంగా తీసుకోవాలి. కేరళ అందాలను తలదన్నే గోదావరి జిల్లాలపై సర్కార్ పెద్దగా దీనిపై దృష్టి పెట్టింది లేదు. ప్రయివేట్ ఆపరేటర్ల చేతుల్లో పర్యాటకం పెట్టడంతో కాసుల కోసం నిబంధనలకు పాతర పడిపోతుంది. పర్యవేక్షణ సైతం అవినీతి వరదలో కొట్టుకుపోతుంది. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపంలా నీటిలో తెలియాడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదాల కట్టడి చేస్తే పాపికొండలతో పాటు కోనసీమ లోని దిండి రిసార్ట్స్ హౌస్ బోట్స్ కు డిమాండ్ పెరిగే అవకాశాలు వున్నాయి. రైలు, రోడ్డు, విమాన కనెక్టివిటీ కలిగిన గోదావరి జిల్లాల పర్యాటక అభివృద్హిపై నిర్లక్ష్యం వీడి సరైన చర్యలు ఇప్పటికైనా చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.