విజయవాడ, జూలై 13,
దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ ఆకాంక్షలకు ఇక్కడి ప్రాంతీయ పార్టీలు పెద్ద అవరోధంగా నిలిచాయి. దక్షిణాదిలో ఒక్క కర్నాటక తప్ప మరే ఇతర రాష్ట్రంలోనూ బీజేపీ తన ఉనికిని బలంగా చాటుకోవడంలో విఫలం అయ్యింది. ఇప్పుడిప్పుడు తెలంగాణ ఒకింత బలోపేతమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయినా అక్కడ అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా బీజేపీకి గట్టి పోటీనిచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అడ్డుపడటమే కాకుండా కేంద్రంలోని మోడీపై తీవ్ర స్థాయి విమర్శలతో కాలుదువ్వుతున్నారు. అదే సమయంలో మరో తెలుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎలాంటి ఉనికి, పునాదీ లేకపోయినా.. కేంద్రంలో అధికారంలో ఉన్నదన్న ఏకైక కారణంతో.. అవసరాలేమైతేనేం సీఎం జగన్ మాత్రం మోడీ ప్రతి కార్యక్రమానికి, ప్రతి విధానానికీ మద్దతు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో బీజేపీ ఎలాగూ ఢీ అంటే ఢీ అనే విధానాన్నే అనుసరిస్తోంది. అయితే ఏపీలో మాత్రం అధికార వైసీపీ మోడీ సర్కార్ తో బహిరంగంగానే రహస్య మైత్రిని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారం కోసం మోడీ షా ద్వయం ఎటువంటి వ్యూహ రచన చేస్తున్నదన్న విషయంలో పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ మోడీ షా ద్వయం నేతృత్వంలోని బీజేపీ చెబుతున్నప్పటికీ ఇక్కడి అధికార పార్టీతో రహస్య మైత్రి కొనసాగించడంలోని ఆంతర్యంపై పరిశీలకుల అంచనాలు పలు విధాలుగా ఉంటున్నాయి. ఏపీ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల ఆస్త్రాలు సంధిస్తున్నా, వాటికి వైసీపీ నాయకత్వం నుంచి దీటుగా బదులు రావడం లేదు. వైసీపీ సర్కార్ పై యుద్ధమే అంటే ఏపీ బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం అవసరమైన ప్రతి సందర్భంలోనూ జగన్ సర్కార్ కు అండగా నిలుస్తోంది.ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్న ఏపీ సర్కార్ కు నిబంధనల చట్రాలను దాటి మరీ అప్పులకు అనుమతులు ఇస్తోంది. అయితే ఇదంతా మోడీ, షా ద్వయం వ్యూహం మేరకే జరుగుతోందన్నది విశ్లేషకుల బావన. 2019 ఎన్నికలలో ఏపీ నుంచి ఒక్క అసెంబ్లీ సీటు, ఒక్క లోక్ సభ స్థానంలోనూ గెలవలేకపోయిన బీజేపీ, పోటీ చేసిన ఏ స్థానంలోనూ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన బీజేపీ, వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం అన్న స్థాయిలో బిల్డప్ ఇవ్వడం వెనుక మోడీ, షాల పటిష్ట, పకడ్బందీ వ్యూహమే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక పక్కన హస్తినలో దోస్తీ కలర్ ఇస్తూనే మరో పక్కన గల్లీలో మాటల యుద్ధానికి బీజేపీ నేతలు కాలుదువ్వడం వెనుక మోడీ, షాల వ్యూహమే ఉందని అంటున్నారువాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఏపీలో బీజేపీకి అధికార పీఠం అందడం అనేది దాదాపు అసాధ్యం, అయినా.. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఎందుకు అంతలా వైసీపీపై రెచ్చిపోయి మాట్లాడగలుగుతున్నారనే సీక్రెట్ అందరికీ తెలిసిందే అంటున్నారు. మొన్నామధ్యన కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నకల్లో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టింది. ఇటీవలే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో కూడా అభ్యర్థిని నిలబెట్టింది. కేంద్రంలో తనకే మద్దతిస్తున్న జగన్ పార్టీపై రాష్ట్రంలో ఇలా పోటీకి దిగడం వెనుక మోడీ రహస్య ప్రణాళికే ఉందంటున్నారు. అయితే ఆ రెండు ఉప ఎన్నికలలోనూ బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు అది వేరే సంగతి. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే బరిలో దించిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానిక బీజేపీ నాయకత్వం మాత్రమే వైసీపీపై, జగన్ పై దూకుడుగా ఉన్నా.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత జగన్ కు కేంద్రం నుంచి కూడా వరుస ఝలక్ లు తప్పవని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.వరుసగా రెండు సార్లు జాతీయ స్థాయిలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి ఈ సారి ఎన్నికల్లో గతంలో కంటే ఎంపీ స్థానాలు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. ఆ లోటును పూడ్చుకునేందుకు బీజేపీ అధినాయకత్వం దక్షిణాదిపై దృష్టి సారించిందంటున్నారు. తమిళనాడులో బీజేపీ ఆటలు ఎలాగూ సాగవు. కేరళలో కూడా ఇంచు మించు అదే వాతావరణం ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్ తో విభేదించే వైఖరితో ఎన్నికలకు వెళ్లేందుకే సిద్ధమైంది. తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో కచ్చితమైన అంచనా లేకపోవడంతో ఇక.. మిగిలి దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకే ఇక్కడ అటు జనసేనతోనూ.. ఇటు అదికార వైసీపీతోనూ కర్ర విరగాకూడదు.పాము చావా కూడదన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయానికి ఏ పార్టీతో కలిసి పోటీ అన్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించే వరకూ వైసీపీతో హస్తినలో దోస్తీ, ఏపీలో కుస్తీ అన్న విధానాన్నే అవలంబిస్తుందనీ, అలాగే జనసేనతో కూడా మైత్రికి కటీఫ్ చెప్పకుండా కొనసాగిస్తుందనీ అంటున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి ఏ పార్టీ అధిక ఎంపీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తుందో ఆ పార్టీలో కలిసి రంగంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు. కేసుల కారణంగా జగన్ బలహీనతను అడ్డు పెట్టుకుని అత్యథిక స్థానాలు బేరం ఆడే అవకాశం ఉంటుందన్నది బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనగా కనిపిస్తుందంటున్నారు. ఎంపీ సీట్లతో పాటు చెప్పుకోదగ్గ అసెంబ్లీ స్థానాలలో కూడా జగన్ బలహీనతను అడ్డు పెట్టుకుని సాధించుకోవచ్చన్న వ్యూహంతోనే బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్రం ఏపీ సర్కార్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని అంటున్నారు