రాజమండ్రి, జూలై 13,
సామర్లకోట పరిసర ప్రాంతాల్లో అతిసార జాడలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వాంతులు విరోచనాలతో బాదపడుతున్న కేసులు ఆసుపత్రిలో నమోదు అవుతున్నాయి. తాజాగా అతిసార బారిన పడిన ఇరువురు సామర్లకోట ప్రభుత్వ క్లస్టరు ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, కొద్దిపాటి వర్షాలు, గోదావరి కాల్వకు కొత్తనీరు రావడం, నీటి కలుషితం, ఆహార కాలుష్యం వంటి కారణాల వల్ల అతిసారం ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు నిత్యం పంపింగ్ చేస్తున్న గోదావరి రక్షిత జలాలను మరింతగా శుద్ధిచేసి క్లోరిన్, ఆలం శాతం మరింత పెంచి త్రాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. సామర్లకోట గోదావరి కాల్వ మూసివేత సమయంలో సమీప పరిశ్రమల కలుషిత జలాలు అదిక సంఖ్యలో గోదావరి కాల్వలో కలిసాయి. దాంతో మున్సిపాల్టీ నీటి శుద్ధిపై మరింత దృష్టిపెట్టాల్సి ఉంటుంది. అలాగే చిన్న చిన్న పైపులైన్ల లీకులు అరికట్టాలి. లేదంటే తాగునీరు కలుషితం అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ముందస్తు హెచ్చరికలు ప్రకటనలు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలి. నిల్వమాంసం, చేపలు విక్రయాలపై దాడులు చేపట్టి నిరోధించాలి. కాగా సామర్లకోట పరిసర ప్రాంతాల్లో అడపాదడపా డయేరియా కేసులు నమోదవుతున్నాయని, ఈ విషయమై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైధ్యాధికారి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చెప్పారు. ముఖ్యంగా నిల్వ మాంసం చేపలు తినడం వల్ల, కలుషిత జలాలు తాగడం వల్ల డయేరియా భారిన పడే అవకాశాలున్నట్లు చెప్పారు. కేసులు సంఖ్య పెరగక ముందే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని సూచించగా, మున్సిపల్ కమీషనర్ స్పందించి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు నిల్వ మాంసం, చేపలు తినరాదని, నీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు. వాంతులు విరోచనలు అధికంగా అవుతుంటే వెంటనే ఆసుపత్రికి తరలిరావాలని సూచించారు. కాగా సీజనల్‌గా వచ్చే వ్యాదుల పట్ల ఇప్పటికే మున్సిపాల్టీ పరంగా అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతున్నారు. నిత్యం గోదావరి జలాల శుద్ధిచేసే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. అవసరమైన మేరకు జలాలు శుద్ధిచేసి పైపులైన్లుకు లీకులు లేకుండా ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో పారిశుద్ద్యం పనులు సకాలంలో చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని ఆయన సూచించారు.