YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పలాయనమేనా

పలాయనమేనా

న్యూఢిల్లీ, జూలై 13,
ఇల్లు కొల్లేర‌వుతుంటే, కోళ్ల‌ పందాల‌కి వెళ్లాట్ట వెన‌క‌టికి ఒక‌డు. అలా వుంది రాహుల్ గాంధీ తంతు. ఒక వంక దేశంలో కాంగ్రెస్ పార్టీకి అన‌నుకూల ప‌రిస్థితులు ఎదురౌతున్నాయి. గోవాలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. త్వ‌ర‌లో పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు, అంత‌కు మించి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు వున్నాయి. స‌రిగ్గా కాంగ్రెస్ కీల‌క నేత రాహుల్ గాంధీకి యూర‌ప్ వెళ్ల‌డానికి ఇదే స‌మ‌యం దొరికిందా? ఆయ‌న యూర‌ప్ ట్రిప్ అన‌గానే కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఖంగారు మొద‌ల‌వుతుంది. రాకుమారుడు దేశ‌ ప‌ర్య‌ట‌న‌కో, విదేశీ యాత్ర‌కో వెళ్లాడంటే రాజ్యానికి, రాజ‌ కుటుంబానికి గొప్ప మేలు జ‌రుగుతుంద‌ని పూర్వం భావించేవారు. దేశాటన చేసి పరిపక్వత సాధించి తిరిగి వస్తాడని, దేశానికి మేలు చేస్తాడనీ అనుకునే వారు. కానీ ఈ రోజుల్లో ఈ అత్యాధునిక రాజ‌కీయ కుతంత్రాల కాలంలో ఈ రాకుమారుడి యాత్ర‌లు ఆందోళ‌న‌లే క‌లిగి స్తున్నాయి. ఆ మ‌ధ్య నేపాల్ వెళ్లారు రాహుల్‌. అక్క‌డ ఏదో గొప్ప ప‌నిమీద వెళ్లార‌ని అంతా భావించారు. కానీ త‌ర్వాత తెలిసిందేమంటే అయ్య‌గారు అక్క‌డ నైట్ క్ల‌బ్‌లో స‌ర‌దాగా గ‌డిపేర‌ని. ఏదో స్నేహితుడు పిలిస్తే వెళ్లార‌న్నారు. కానీ ఒక దేశ కీల‌క ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలి కుమారుడు, అత్యంత ప్ర‌జాద‌ర‌ణ వున్న పార్టీకి వెన్నుద‌న్నుగా నిల‌వాల్సిన‌వాడు ఈ విధంగా స‌ర‌దాలు చేసుకోవ‌డం విప‌క్షాల‌కు మాంఛి మ‌సాలా క‌బ‌రు ఇచ్చిన‌ట్టే గ‌దా! అదే జ‌రిగింది. ప్ర‌తిప‌క్షాలు పూర్తిగా స‌మాచారం సేక‌రించి మ‌రీ దుమ్మెత్తిపోశాయి.ఈ విధంగా రాహులుడు త‌ర‌చూ వివాదాల్లో చిక్కుకోవ‌డంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు కూడా   ఇబ్బందిప‌డుతున్నారు. పార్టీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే త‌రుణంలో అయ్య‌వారు ఇలా వ్యక్తిగత విదేశీ పర్యటనల పేరుతో  త‌ప్పించుకోవ‌డ‌మేమిట‌ని చెవులు తెగ కొరికేసుకుంటున్నారు. కానీ పైకి అన‌లేని ప‌రిస్థితి పాపం. కాగా ఇపుడు తాజాగా రాహుల్ గాంధీ యూర‌ప్ ట్రిప్ మాత్రం పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మేన‌ని అంటున్నారు.  కాగా ఆయ‌న ఆదివారం తిరిగి రావ‌చ్చ‌నే స‌మాచార‌మూ వుంది. స‌రిగ్గా అవ‌స‌ర‌ స‌మ‌యంలో యువ‌రాజు ఇలా వెళ్ల‌డం ఎంత వ్య‌క్తిగ‌త‌మైనా, పార్టీ వ‌ర్గాల‌కు అందునా ఈ కీల‌క‌స‌మ‌యంలో స‌మ‌స్యాత్మ‌కంగానే వుంటుంది. గురువారం పార్టీ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మ‌రి రాహుల్ గాంధీ లేకుండానే పార్టీ పెద్ద‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని పార్టీ వీరాభిమానులు ఎద‌రుచూస్తున్నారు. మరో వంక బీజేపీ నేతలకు రాహుల్ విదేశీ పర్యటన కాంగ్రెస్ పై విమర్శలకు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ పై సెటైర్లకు మంచి అవకాశం దొరికిందని సంతోష పడుతున్నారు. తెలిసి తెలిసి రాహుల్ స్వయంగా వారికి ప్ర‌చార సామ‌గ్రిగా   మార‌డం విడ్డూర‌మే. దేశ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో క‌డు జాగ్ర‌త్త‌గా అడుగు వేయాల్సిన‌పుడు రాహుల్ స్వంత ప‌నుల మీద విదేశీ యాత్రలకు వెళ్ల‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు అన్న‌ది  యువ‌నేత ఒక్క‌సారి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. అన్నిటి కంటే మించి రాహుల్ విదేశీ పర్యటనలో ఉండగానే పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన కీలక సమావేశం జరగనుంది. గురువారం జరిగే ఈ సమావేశానికి రాహుల్ గైర్హాజరు కావడం గమనార్హం. అదీ కాక సోనియాగాంధీ కోవిడ్ నుంచి కోలుకుని ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. పార్టీలో గోవా సంక్షోభం, అధ్యక్ష ఎన్నికపై కీలక సమవేశం జరుగుతున్న సమయంలో ఆమెకు తోడుగా నిలవాల్సిన రాహుల్ ఇలా వ్యక్తిగత పర్యటనలంటూ విదేశాలకు చెక్కేయడంపై పార్టీ శ్రేణుల్లోనే ఒకింత అసంతృప్తి వ్యక్తమౌతోంది.

Related Posts