కాపు ఉద్యమాన్ని భుజస్కంధాలపై వేసుకుని పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం అడుగులు ఎటువైపు వేస్తారనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది. కాపుల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ముద్రగడ చేపట్టిన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో సర్కారు అణిచివేస్తున్న సంగతి తెలిసిందే! ఆయన వెనుక వైఎస్సార్‌సీపీ ఉందని, ఆ పార్టీ అధినేత జగన్ చెప్పినట్లు ఆడుతున్నారంటూ ఒకవైపు టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణను ఆయన కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం ఇక్కడ కీలకమైన అంశంగా మారింది.ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కాపు ఉద్యమాన్ని భుజస్కందాలపై వేసుకున్న ముద్రగడ పద్మనాభం రాజకీయ అడుగులు ఎటువైపు అనే చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆయన వైసీపీ వైపు పాజిటివ్‌గా ఉన్నారని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గ ఓటర్లపై జగన్ దృష్టిసారించిన నేపథ్యంలో.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ప్రత్తిపాడు నుంచి పోటీచేయించాలని భావిస్తున్నారు. ముద్రగడ మరోవైపు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు విషయంలో కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణను ముద్రగడ స్వయంగా వెళ్లి కలవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వారిద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.ముద్రగడ-కన్నా ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన నేతలే కావటంతో పాటు వారిద్దరి మధ్య ఎప్పటి నుంచో సన్నిహితం కూడా ఉంది. అందుకనే తమ భేటీ సందర్భంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు ఫోన్ చేసి ముద్రగడతో మాట్లాడించినట్లు సమాచారం. కన్నా-ముద్రగడ భేటీ తర్వాత ఈ విషయమై పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. కాపు నేతల సమాచారం ప్రకారం ముద్రగడ పద్మనాభం.. బీజేపీలోచేరే అవకాశాలు ఇప్పటికైతే లేనట్లేనని చెబుతున్నారు.ముద్రగడ బీజేపీలో చేరితే సామాజికవర్గ పరంగా కూడా ఉపయోగాలుంటాయని పలువురు భావిస్తున్నారు. అయితే తాను బీజేపీలో చేరే ఉద్దేశంలో లేనట్లు ముద్రగడ చెబుతున్నారు. గతంలోనే ముద్రగడ బీజేపీలో పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. కన్నాతో ఉన్న సంబంధాల కారణంగా రేపటి ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి వీలైనన్ని టిక్కెట్లు ఇప్పించుకోవాలని ముద్రగడ యోచిస్తున్నారట. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇరు పార్టీల నేతలకు ప్రస్తుతం కాపు సామాజికవర్గ అండ చాలా ముఖ్యం. అందుకే ఇరు పార్టీల నేతలు.. ముద్రగడకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఎటువైపు మొగ్గుచూపుతారనే ప్రశ్న ఎదురవుతోంది.కమల నాథులు కూడా బలమైన నేతల కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క వైసీపీ కూడా ముద్రగడకు ఆహ్వానాలు పంపుతుండటం కొత్త చర్చకు దారితీసింది. శత్రువుకు శత్రువు మిత్రుడు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఇదే సూత్రం చుట్టూ తిరుగుతున్నాయి. అటు బీజేపీకి, ఇటు వైసీపీకి కామన్ శత్రువు టీడీపీ. ఈ నేపథ్యంలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న నేతలపై ఈ రెండు పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. అందులోనూ కీలకమైన సామాజికవర్గ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.