అమలాపురం, జూలై 13
భూమిలో నుంచి సెగలు, పొగలు..మట్టిని పట్టుకుంటే కాలిపోతోంది. ఎస్..కోనసీమ జిల్లా టి.కొత్తపల్లిలో పరిస్థితి ఇది. కోనసీమ జిల్లాలో ఓవైపు భారీ వర్షాలు వరదలతో జనం తీవ్ర అవస్థలు పడుతుంటే.. మరోవైపు భూమి నుంచి పొగలు వస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. ఐ. పోలవరం మండలం టి.కొత్తపల్లిలో భయం నెలకొంది. ఓ ఇంటి ఆవరణలో భూమి నుంచి పొగలు, ఆవిర్లు రావడంతో స్థానికులకు గుబులు పట్టుకుంది. భూమి నుంచి పొగలపై టీవీ9 కథనాలకు స్పందించిన తహసీల్దార్..వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా కుండపోత వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.అలాగే కోనసీమ జిల్లాలోనూ వానలు దంచికొడుతున్నాయి. ఐతే ఐ పోలవరం మండలం టి.కొత్తపల్లి గ్రామంలో..పడిన వర్షం నీరు కూడా వేడెక్కుతోంది. దీంతో షాక్‌కు గురైన స్థానికులు..నీరు వేడెక్కడానికి కారణమేంటా అని కొన్ని అడుగుల మేర బోరు వేసి చూశారు. ఐతే భూమిలో నుంచి పొగలొచ్చాయి. మట్టి నుంచి ఆవిర్లు వస్తున్నాయి. ఆ మట్టిని పట్టుకుంటే చేతులకు బొబ్బలొస్తున్నాయంటున్నారు స్థానికులు.భూమిలో నుంచి ఆవిరి, పొగలతో పాటు..మట్టిని పట్టుకుంటే చేతులు కాలిపోతుండటంతో భయాందోళన చెందుతున్నారు టి. కొత్తపల్లి వాసులు. ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. జోరున వానలు పడుతుంటే..భూమి వేడెక్కడానికి కారణమేంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. అసలు భూమి నుంచి పొగలు రావడానికి రీజనేంటో గుర్తించి..అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.