విజయవాడ, జూలై 14,
చంద్రబాబు తెలివైన నేత. భవిష్యత్ ను పసిగట్టగలిగిన లీడర్. కానీ ఇటీవల కాలంలో ఆయన అనుకున్నవేమీ జరగడం లేదు. ఆగస్టు నెల నుంచి ఆయనకు మరింత ఇబ్బందులు ఎదురుకానున్నాయి. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోనున్నారు. ఇక ఢిల్లీలో తమ తరుపున లాబీయింగ్ చేేసే వాళ్లు కూడా ఎవరూ చంద్రబాబుకు దొరకరు. ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించగలవారు ఎవరూ లేరు. గతంలో చంద్రబాబుకు ఢిల్లీలో లాబీయింగ్ చేసే వారు అనేక మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబుకు దారి దొరకడం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతిచ్చినందుకు కేంద్ర నాయకత్వం కోపం ఇంకా చల్లారలేదు. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో భవిష్యత్ లేదని భావించి మళ్లీ బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీకి ఒకసారి వెళ్లి అపాయింట్ మెంట్ దొరకక వెను దిరిగి వచ్చారు. మరోసారి ఆ ప్రయత్నం ఇప్పటి వరకూ చేయలేదు. అదే జరిగి ఉంటే... వెంకయ్యనాయుడుకు పదోన్నతి వచ్చి రాష్ట్రపతి అయి ఉంటే చంద్రబాబుకు ఢిల్లీలో అండ దొరికేది. భరోసా లభించేది. కానీ వెంకయ్య నాయుడు రాష్ట్రపతి పదవి దక్కకపోవడంతో ఉప రాష్ట్రపతి పదవిలో కూడా కంటిన్యూ అయ్యేందుకు ఇష్టపడటం లేదు. ఆయన రాజకీయంగా రిటైర్ మెంట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వెంకయ్య నాయుడు వివాదం లేని రాజకీయ నేత. కానీ ఆయన తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలం అన్న ముద్ర ఉంది. ఎన్టీఆర్ హయాం నుంచే వెంకయ్య నాయుడు టీడీపీకి మద్దతుదారుగా ఉండేవారు. ఆయన వల్లనే బీజేపీ ఏపీలో ఎదగలేదని ఆ పార్టీ నేతలే ఉప రాష్ట్రపతి కానంతవరకూ బహిరంగంగానే విమర్శలు చేసేవారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి నుంచి ఆగస్టులో తప్పుకోనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీ వదలి వస్తారు. బీజేపీ అగ్రనాయకత్వంతోనూ ఆయన ఇక టచ్ లో ఉండక పోవచ్చు. మరో వైపు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు కొందరు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నా కేంద్ర నాయకత్వాన్ని ప్రభావం చేయగల నేతలు కాదు. పైగా ఇప్పుడు చంద్రబాబుకు బలం లేదు. బలగం లేదు. అందుకే బీజేపీ ఆయనను అడగకపోయినా రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించి ఉండవచ్చంటున్నారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఢిల్లీ నుంచి ఎదురు కాకుండా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ముందుగానే ప్రకటించి ఉంటే ఇన్ని అనుమానాలు వచ్చేవి కావు. చివరి నిమిషంలో మద్దతు ప్రకటించడంతోనే ఢిల్లీ డౌట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలోనూ చంద్రబాబు నిర్ణయం ఎన్డీఏ వైపు ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.