YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ద్రౌపదీకి అన్నీ ఓట్లు

ద్రౌపదీకి అన్నీ ఓట్లు

విజయవాడ, జూలై 14,
చిత్రం. నిజంగా ఇదొక విచిత్రం. ఆంధ్ర ప్రదేశ్’ అసెంబ్లీలో బీజేపీకి చోటు లేదు. ఒక్క ఎమ్మెల్యే అయినా లేరు, అసెంబ్లీలో ఆ పార్టీ బలం సున్నా. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ, ఏపీ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేదు, నిన్నమొన్నటి వరకు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన రాజ్యసభ సభ్యులు ఇద్దరు ముగ్గురున్నా, ఇప్పడు వారి పదవీ కాలం ముగిసిపోవడంతో, పార్లమెంట్ ఎగువ దిగువ సభల్లో, ఏ సభలోనూ  ఏపీ బీజేపీకి ఎంట్రీ లేదు. రాష్ట్రంలో ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ ఏదీ లేదు. అధికార, ప్రతిపక్షాలలో (వైసీపీ, టీడీపీ) ఏదీ బీజేపీ మిత్ర పక్షం కాదు, మిత్ర పక్షం జనసేన పార్టీది   కూడా బీజేపీ పరిస్థితే .. ఒక్క ఎంపీ లేరు. ఒక్క ఎమ్మెల్యే లేరు. రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజిలో బీజేపీ, జనసేన పార్టీలలో దేనికీ ఓటు లేదు.  రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజిలోని ఓట్లలో ఒక్క ఓటు బీరు పోకుండా, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ కూటమి ఖాతాలో చేరుతున్నాయి. అధికారికంగానా, అనదికారకంగానా అనేది పక్కన పెడితే అధికార వైసీపీ, ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్మకు అడగక ముందే మద్దతు తెలిపింది. ఇప్పుడు తాజాగా, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కూడా ఎన్డీఎ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. సో ... రాష్ట్రం నుంచి పోలయ్యే ప్రతి ఓటు ముర్ము ఖాతాలో చేరుతుంది. భారత రాజకీయాల్లో ఇదొక విధంగా విచిత్ర పరిస్థితి. గతంలోనూ, ఒక రాష్ట్రంలో ఉన్నమొత్తం ఓట్లు ఒకే అభ్యర్ధికి పోలైన సందర్భాలు ఉంటే ఉండవచ్చును, కానీ, రాష్ట్రంలో ఓటే లేని పార్టీ / కూటమి అభ్యర్ధికి గంప గుత్తగా ఓట్లన్నీ పోలుకావడం, బహుశా రాష్ట్రపతి ఎన్నికల చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చును.  అదొకటి అలాఉంటే, జూలై 18 జరిగే ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికలకు సమబందించి కొన్ని ఆసక్తి కర పరిణామాలు అయితే, చోటు చేస్కున్నాయి, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జూన్ 14 న, కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూలు ప్రకటించింది. అయినా, ఎన్డీఅభ్యర్ధి ఎవరైనా గెలుపు ముందుగానే ఖరారై పోవడం వలన, గెలుపు ఓటముల గురించి, పెద్దగా చర్చ జరగలేదు. అయితే, అధికార, విపక్షాల అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత చిత్ర విచిత్ర పరిణామాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక ఒక ప్రహసంగా సాగింది. ఒకటో కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు ఇలా ఒక్కొక్క పేరు తెర మీదకు వచ్చి తప్పుకుంటూ పోయింది. చివరకు, యశ్వంత్ సిన్హా ఉమ్మడి అభ్యర్ధిగా తెర మెడకు వచ్చారు.  బీజేపీ/ఎన్డీఎ గిరిజ మహిళ, ద్రౌపతి ముర్ముపేరును ప్రకటించిన తర్వాత, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్న పార్టీలు ఒకటికటిగా సారీ అంటూ చేయి వదిలేస్తున్నాయి. ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ముందుగా అనుకున్న విధంగానే ఏ కూటమిలోనూ లేని వైసీపీ, బీజేడీ (కారాణాలు ఏవైనా) ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. కానీ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలో కూడా ఒకటొకటిగా జారిపోతున్నాయి, యశ్వంత్ సిన్హా స్వరాష్ట్రం ఝార్ఖండ్’ లో అధికారంలో ఉన్న యూపీఏ భాగస్వామ్య పార్టీ  జేఎంఎం ముర్ముకు మద్దతు ప్రకటించింది. యశ్వంత్ సిన్హా స్వరాష్ట్రమే కాదు, సొంత పార్టీ, టీఎంసి కుడా, ఆయనను దూరంగానే ఉంచుతోంది.  ఆయన పేరును వెనకుండి ముందుకు తెచ్చిన టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ కూడా, యశ్వంత్ సిన్హాకు హ్యాండ్ ఇచ్చే సంకేతాలు ఇచ్చారు. ద్రౌపతి ముర్ము పేరు ముందే ప్రకటించి ఉంటే, అసలు యశ్వంత్ సిన్హాను బరిలో  దించక పోదుమని, పరోక్షంగా, ముర్ముకు మద్దతు ఇచ్చే సంకేతాలు ఇచ్చారు. అంతే కాకుండా గెలిచే అవకాశాలు ఎండీఎ అభ్యర్ధికే ఉన్నాయని, యశ్వత్ సిన్హాను పోటీ నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటే ఉత్తమం అనే సలహా ఇచ్చారా అన్నట్లుగా, మరో విధంగా సిన్హాను అవమానించే విధంగా ఓ ప్రకటన చేశారు. ప్రచారం పేరున బెంగాలుకు రావద్దని అన్నారు. చివరకు శివసేన రెండు వర్గాలు, బీజేపీ హార్డ్కోర్ శత్రు పక్షం ఎస్పీ, ఎస్పీ చీలిక వర్గం ఎస్బీఎస్పీ , బీఎస్పీ, గోవాలో కాంగ్రెస్ చీలిక వర్గం ఇలా ఒకటికటిగా పార్టీలు, ముర్ముకు మద్దతు తెలుపుతున్నాయి. చివరకు కాంగ్రెస్ పార్టీలోనూ యశ్వంత్ సిన్హా కు సంపూర్ణ మద్దతు లభించే పరిస్థతి లేదని అంటున్నారు. తెలంగాణలో పర్యటనలో యశ్వంత్ సిన్హా  తెరాస, కాంగ్రెస్ రాజకీయ వైరుధ్యాల కారణంగా కాంగ్రెస్ పార్టీని కలవకుండానే వెనక్కు వెళ్ళిపోయారు. ఇలా ఓ వంక ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు క్యూకట్టి ఎన్డీఎ అభ్యర్ధు ద్రౌపతి ముర్ముకు జై కొడుతున్నాయి. మరోవంక మద్దతు ఇస్తున్నపార్టీలు ఏవీ కూడా ఆయన్ని సొంతం చేసుకుంటున్నట్లు లేదు. తెరాస వంటి కొన్ని పార్టీలు ఇంకా యశ్వంత్ సిన్హా’కు మద్దతు తెలుపుతున్నా, చివరకు ఆత్మ ప్రభోధమే అందరి నినాదం అయ్యేలా వుందని అంటున్నారు. నిజానికి  యశ్వత్ సిన్హాకు గెలుపు మీద ఎప్పుడూ ఆశలు లేవు.. కానీ, ఓటమి ఏ స్థాయిలో ఉంటుంది అనేదే, ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

Related Posts