ఏలూరు, జూలై 14,
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. కానీ దానిని సత్వరమే పూర్తి చేయడానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పనులను పరుగులు పెట్టించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పోలవరం ప్రాజెక్టు పనులు వైసీపీ అధికారంలోకి వచ్చాకా నత్తనడకన సాగుతున్నాయి. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల పనులు పూర్తయ్యాయి. ఆ ఫలితం ఇప్పుడు తెలిసింది. చంద్రబాబు దార్శనికత ఫలితం రాష్ట్ర ప్రజలకు మరో సారి అర్దమైంది. వరదనీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. ప్రాజెక్టు గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు. ఈ స్పిల్ వేలోని 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా పూర్తిగా వినియోగంలోకి వచ్చాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు గేట్లు విజయవంతంగా అన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా గోదావరి నది దిగువకు విడుదల చేశాయి.ప్రాజెక్టులోని మొత్తం 48 గేట్లను ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పని తీరు సమర్థంగా ఉందని నిరూపించడంతో పాటు వరదనీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్లు కీలకపాత్ర వహించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వర్షాకాల సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీ ఎత్తున వరదలు వస్తున్నాయి.గోదావరి నదికి ఇలా పెద్ద ఎత్తున వరదలు రావడం వందేళ్ళ చరిత్రలో ఇదే తొలిసారి అని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును అధికారులు ముందుగానే సిద్ధంగా ఉంచారు. స్పిల్ వే నుండి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు.వందేళ్ళ చరిత్రను ఆధారం చేసుకుని పోలవరం స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారు. వందేళ్ళలో గోదావరికి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారని మేఘా ఇంజనీరింగ్ సంస్ద సీజీఎం చెప్పారు. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే గేట్ల నుండి 15 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు.