రాజమండ్రి, జూలై 14,
కొద్దిరోజులుగా రాజమండ్రి రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్.. టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాసుల మధ్య ఉప్పు నిప్పులా మారుతున్నాయి రాజకీయాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరే రాజమండ్రి అర్బన్ బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా మొదలైపోయింది. దానికి తగ్గట్టుగా రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే వాదన స్థానికంగా వినిపిస్తోంది. ప్రధాన పార్టీలు వీరికే టికెట్లు ఇస్తాయన్న గ్యారెంటీ లేకపోయినా.. నాయకులు మాత్రం పక్కా ప్లాన్‌తో లోకల్ పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నారు.రాజమండ్రి అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో ఎంపీ భరత్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీలో కీలకంగా ఉన్న ఆదిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారాయన. పైగా రాజమండ్రిని తన అడ్డాగా చెప్పుకొచ్చారు భరత్. ఈ వ్యాఖ్యలకు వేగంగానే బదులిచ్చారు ఆదిరెడ్డి వాసు. కేవలం ప్రతి విమర్శలతో సరిపెడితే బాగోదని అనుకున్నారో ఏమో.. భరత్‌కు ఓ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని.. వైసీపీ నుంచి భరత్ బరిలో ఉంటే రాజమండ్రి ఎవరి అడ్డానో తేలిపోతుందని సవాల్ చేశారు వాసు. ఆ తర్వాత ఈ మాటల యుద్ధం మరో మలుపు తిరిగింది. రెండు పార్టీలకు చెందిన కింది స్థాయి కార్యకర్తలు కూడా సవాళ్లు చేసేసుకుంటున్నారు.వాస్తవానికి ఎంపీ భరత్ మూడేళ్లుగా స్థానిక టి.డి.పి. నేతలపై విమర్శలు చేయలేదు. రాజమండ్రి సిటీ… రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారి గురించి మాట్లాడిన సందర్భాలు తక్కువే. అలాంటిది సడెన్‌గా నియోజవర్గ ప్లీనరీలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని ఎంపీ లక్ష్యంగా చేసుకోవడం చర్చగా మారింది. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందే టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తన బదులు తన భర్త వాసు బరిలో ఉంటారని చెప్పారామె. ఆ తర్వాతే క్రమంగా రాజకీయ వేడి రాజుకుంటోంది.రాజమండ్రి అర్బన్‌లో ప్రస్తుతం వైసీపీ కోఆర్డినేటర్ పోస్ట్ ఖాళీగాఉంది. కొత్తగా ఎవరిని నియమిస్తారో కేడర్‌కే తెలియడం లేదట. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలో దిగితే ఎలా ఉంటుందో అని భరత్ లెక్కలేస్తున్నారట. ఎప్పుడూ లేనంతగా రాజమండ్రిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. అందుకే సిటీ టీడీపీలో కీలకంగా ఉన్న ఆదిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు చెబుతున్నారు. అయితే అసెంబ్లీ బరిలో ఈ ఇద్దరి పోటీకి ఆయా పార్టీలో అంగీకరిస్తాయా అనేది మరో ప్రశ్న. రాజమండ్రి టీడీపీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, ఆదిరెడ్డి కుటుంబానికి పడటం లేదు. సిటీ సీటుపై గోరంట్ల కూడా కన్నేశారు. ఇక ఎంపీ భరత్ విషయానికి వస్తే.. ఆయన్ని అసెంబ్లీ బరిలో దించే సాహసం చేస్తారా అనే అనుమానాలు ఉన్నాయట. గత రెండు ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇచ్చినా వైసీపీకి గెలుపు దక్కలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓసీకి ఛాన్స్ ఇస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో భరత్ పోటీపై పార్టీ వర్గాలే సందేహాలు వ్యక్తం చేసే పరిస్థితి. క్షేత్రస్థాయిలో వైసీపీ, టీడీపీలో జరుగుతున్న చర్చ ఇదైతే.. అవేమీ పట్టనట్టు భరత్, వాసులు ప్రకటనలు చేసేస్తున్నారు. మరి.. రాజమండ్రిలో ఏం జరుగుతుందో చూడాలి.