YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విలీన ఆందోళనలు ఉధృతం

విలీన ఆందోళనలు ఉధృతం

నెల్లూరు, జూలై 14,
పాఠశాలల విలీన ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. గత మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాలలకు తాళాలు వేశారు. తమ పిల్లలను మూడు కిలోమీటర్ల దూరం ఉన్న పాఠశాలకు పంపడం కష్టమని, రహదారులు దాటే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఎంఇఒకు వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థుల, తల్లిదండ్రుల ఆందోళనకు సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మద్దతు తెలిపారు.నెల్లూరు జిల్లాలోని టిపిగూడూరులో పాఠశాలకు తాళం వేసి విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విలీన నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని, లేకపోతే ఆందోళనను ఉదఅతం చేస్తామని హెచ్చరించారు.ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని మాదాలవారిపాలెం ఎస్‌సికాలనీలోని హరిజన పాఠశాలలోని తరగతులను వేరే పాఠశాలలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి.. నిరసన తెలిపారు.కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని విభరాపురం గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను పాఠశాల గదిలో నిర్బంధించారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం అన్నవరం పాఠశాలలో 6, 7, 8 తరగతులను వేములపూడి జెడ్‌పి పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఎంఇఒ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్‌ అయ్యప్పరెడ్డి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన తెలిపారు. కశింకోట మండలం బయ్యవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను స్థానిక హైస్కూల్లో విలీనం చేయొద్దంటూ ఆందోళన చేపట్టి ఎంఇఒకు వినతిపత్రం అందజేశారు. అనకాపల్లి మండలం బౌలువాడ పంచాయతీ ఆర్‌విఎస్‌.నగర్‌ రిక్షా కాలనీ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను బౌలువాడ ఎంపియుపి స్కూల్‌లో విలీనం చేస్తే సహించేది లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనకాపల్లి - చోడవరం రోడ్డులో బైఠాయించారు. నిరసనకు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మద్దతు తెలిపారు. నర్సీపట్నం మండలంలోని తురకబడి పాఠశాల వద్ద విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలల విలీనాన్ని నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఎ వద్ద నిరసన తెలిపారుఅనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయొద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మైలసముద్రం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎంఇఒ, పంచాయతీ కార్యాలయాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేసి ఎంఇఒకు వినతిపత్రాలు అందజేశారుపశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని ఏడో వార్డులోని ప్రాథమిక పాఠశాలలోని తరగతులను ఎస్‌కెపిఅండ్‌టివిఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్లో విలీనం చేయడం తగదని విద్యార్థులు ధర్నా చేశారు. తమ పిల్లలు రోడ్డు దాటి వెళ్లి రావాలంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మద్దతు తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని ఎంఇఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, బ్రాహ్మణతర్లా ప్రాథమికోన్నత పాఠశాలల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రూ.లక్షల వ్యయంతో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్ది నేడు వేరే పాఠశాలలో విలీనం చేయడం దారుణమన్నారు. కవిటి మండలం బెజ్జిపుట్టుగ ప్రాథమిక పాఠశాలను మూడు కిలోమీటర్ల దూరంలోని జగతి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విలీనం చేయొద్దని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆధ్వర్యాన గ్రామస్తులు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు వినతిపత్రం అందజేశారు.విజయనగరం పరిధిలోని జమ్ము ప్రాథమిక పాఠశాల, వేపాడ మండలంలోని వల్లంపూడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. రేగిడి మండలంలోని మునకలవలస ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంఇఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

Related Posts