YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బయోమెట్రిక్ సరే... కరెంట్ సంగతేంటి...

బయోమెట్రిక్ సరే... కరెంట్ సంగతేంటి...

ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు కోసం విద్యుత్తు సౌకర్యం తప్పనిసరి అవసరంగా మారింది. కానీ చాలా పాఠశాలలు బిల్లులు బకాయి పడటంతో కనెక్షన్లను తొలగించారు. ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులు అరకొర కావడంతో వాటితో బిల్లులు చెల్లించడం సాధ్యం కాలేదు.  చెల్లింపులు ఆగిపోయి బకాయిలు పేరుకుపోయాయి. పాఠశాలలు కేటగిరి-7 కిందకు రావడంతో యూనిట్‌ ధర పెరిగి విద్యుత్తు బిల్లులు అధికమొత్తంలో వచ్చాయి. కొంతకాలం ఏదో విధంగా బిల్లులు చెల్లించినా రానురాను నిధులు సరిపోకపోవడంతో చెల్లింపులు ఆపేశారు.ప్రాథమిక పాఠశాలల్లో మూడు గదులు ఉంటే రూ.10 వేలు, మూడు గదులకంటే ఎక్కువగా ఉంటే రూ.17 వేల చొప్పున పాఠశాల గ్రాంటు, నిర్వహణ నిధులు వస్తున్నాయి. వాటిలో చాక్‌పీసులు, పేపర్లు, మీటింగ్‌ ఛార్జీలు, ప్రశ్నాపత్రాల జిరాక్స్‌లు, కిటికీలు, తలుపులకు మైనర్‌ రిపేర్లు, అపుడపుడు సున్నాలు వేయించడం, రిజిస్టర్లు కొనుగోలు, టీసీ రికార్డులు, నెలవారి నివేదికలు, జెండా పండుగలు, టీఎల్‌ఎం, మంచినీటి కుండలు తదితర ఖర్చులకు ఇందులో నుంచే వాడాలి. వీటితో పాటు విద్యుత్‌ బిల్లులు చెల్లించడమంటే భారమవుతోంది. అందుకే బకాయిలు పెరుగుతూ వచ్చాయి.ప్రస్తుతం ఉన్న బకాయిలన్నింటిని విద్యాశాఖ చెల్లించి మున్ముందు విద్యుత్‌ బిల్లుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఏనాటి నుంచో ఉన్న నిర్వహణ నిధులు, గ్రాంటు నుంచి బిల్లులు చెల్లించడమంటే సాధ్యం కాదని పేర్కొంటున్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించిన మండల అధికారులు వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్క సూర్యాపేట జిల్లానే పరిశీలిస్తే విద్యుత్‌ సంస్థకు సుమారు కోటి రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలంటే బిల్లులు పూర్తిగా చెల్లించాలి. పదేళ్లుగా పాఠశాలలకు విద్యుత్‌ సరఫరా చేసినా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అందుకు విద్యుత్‌ అవసరం కావడంతో సరఫరా పునరుద్దరణ చేపట్టాలని మండల విద్యాధికారులను ఆదేశించింది. ఏఏ పాఠశాలల్లో విద్యుత్‌ సరఫరా లేదో, ఎంతెంత బకాయిలు ఉన్నాయో నివేదిక అందించాల్సిందిగా ఎంఈవోలు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. దాంతో ఆగమేఘాల మీద పాఠశాలల విద్యుత్‌ స్థితిపై నివేదిక ఇచ్చారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఉపాధ్యాయుల గైర్హాజర్‌ తగ్గించాలని భావించిన ప్రభుత్వం అందుకు కసరత్తు చేపట్టింది. బయోమెట్రిక్‌ యంత్రాల ఏర్పాటుకు పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆ సరఫరా లేకపోతే వారం పదిరోజుల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో చాలా వరకు సరఫరా నిలిపివేయడం, సర్వీసు తొలగించడం, బకాయిలు ఉన్నా కొన్ని సర్వీసులను కొనసాగించడం వంటి స్థాయిల్లో ఉన్నాయి. 2010-11 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కర్ణాటక నుంచి ఇందుకు సంబంధించిన సీడీలను తెచ్చారు. కంప్యూటర్‌ల ద్వారా ప్రాథమిక స్థాయి నుంచి సాంకేతిక నైపుణ్య విద్యను అందించాలని సంకల్పించారు. అదే ఏడాది అక్టోబర్‌ 2 నాటికి అన్ని పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని మండల అధికారులను ఆదేశించారు. పాఠశాల గ్రాంటు, నిర్వహణ నిధుల నుంచి డీడీలు చెల్లించి స్విచ్‌ బోర్డు, సర్వీసు వైరు, ఇతర సామగ్రి కొనుగోలు చేయాలని సూచించారు. దాంతో ఉపాధ్యాయులంతా హడావుడిగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నారు. 

Related Posts