కొలంబో జూలై 14
శ్రీలంకలో అధ్యక్ష, ప్రధాని కార్యాలయాలను ఆందోళనకారులు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. నిరసనకారుల ముట్టడి నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం లంకలోని అధ్యక్ష, ప్రధాని భవనాలు ఆందోళనకారుల ఆధీనంలోనే ఉన్నాయి. అయితే ఆ భవనాల నుంచి వెళ్లనున్నట్లు నిరసనకారులు తెలిపారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, ప్రెసిడెన్షియల్ సెక్రటేరియేట్, ప్రధాని ఆఫీసు నుంచి శాంతియుతంగా తక్షణమే ఉపసంహరించుకుంటున్నామని ఆందోళనకారులు ఇవాళ ప్రకటించారు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం తమ పోరాటం ఆగదని ఓ ప్రతినిధి చెప్పారు.శ్రీలంకకు వెళ్లవద్దు అంటూ కొన్ని దేశాలు తమ పౌరులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. బ్రిటన్, సింగపూర్, బహ్రెయిన్ దేశాలు ఇప్పటికే తమ పౌరులకు ఆ ఆదేశాలు ఇచ్చాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇక మాల్దీవులకు పరారీ అయిన లంక అధ్యక్షుడు ఇవాళ సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.