విజయవాడ, జూలై 15,
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ బండారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం బట్టబయలు చేసేసింది.ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.వచ్చే నెల ఒకటో తేదీ నుంచీ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రయ ప్రారంభం కానున్న సమయంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ప్రక్రియలో వాలంటీర్లకు ఎలాంటి జోక్యం ఉండరాదన్న ఉద్దేశంతోనే ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యం విపరీతంగా ఉంటోందనీ, ఓటర్ల జాబితాలో వారు చేతి వాటం చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. వాలంటీర్ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేసిందే ఎన్నికలలో లబ్ధికోసమన్న విమర్శలు చాలా కాలం నుంచీ వస్తున్న సంగతి విదితమే. అందుకు తగ్గట్టుగానే లబ్ధిదారులకు పథకాల లబ్ధి అందే విషయం దగ్గర నుంచీ.. ప్రతి పనీ వారి కనుసన్నలలోనే జరిగేలా జగన్ స్కెచ్ వేశారనీ, అందుకే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చేశారనీ అంటున్నారు. చివరకు ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉందని చెబుతున్నారు.‘గడపగడపకూ’ కార్యక్రమంలో కూడా లబ్ధిదారుల వివరాల జాబితాను ఎమ్మెల్యేలు వలంటీర్ల వద్దనుంచే తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలుగుదేశం పట్ల మొగ్గు చూపుతున్నారనుకున్న వారికి పథకాలు అందకుండా చేయడం దగ్గర నుంచీ వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వరకూ నానా రకాల అరాచకాలకూ జగన్ సర్కార్ వాలంటీర్లను వాడుకుంటోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో జరిగిన గతంలో ఉపఎన్నికల సమయంలోనూ వాలంటీర్ల జోక్యం పెచ్చరిల్లిందన్న విమర్శలూ ఉన్నాయి.