ఏలూరు, జూలై 15,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలను వంటపట్టించుకున్నట్లే కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మరో పదేళ్ల పాటు అధికారం కోసం వెయిట్ చేయాల్సి వస్తుందన్న నిర్ణయానికి వచ్చినట్లున్నారు. టీడీపీ 2024లో అధికారంలోకి వస్తే, 2029వరకూ తాను వెయిట్ చేయాలి. అప్పటికి తిరిగి వైసీపీ బలపడితే తాను మరో ఐదేళ్లు వేచిచూడాలి. అలా కాకుండా ఈ ఎన్నికల్లోనే తాను గెలిచే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత... ఒంటరిగా పోటీ చేయడం, వీలయినన్ని స్థానాలను దక్కించుకుంటే ఎన్నికల తర్వాత అయినా టీడీపీ దిగి వస్తుందని, తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందన్న ఆలోచనలో ఆయన ఉన్నా,రు. హంగ్ దిశగా ఫలితాలు వచ్చినా అది తనకే అడ్వాంటేజీ వస్తుందన్న లెక్కలు ఆయన వేసుకుంటున్నారు. అంతేతప్ప ఇప్పుడు టీడీపీతో పొత్తుతో బరిలోకి దిగితే ముఖ్యమంత్రి పదవి కోసం మరో పదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అప్పటి దాకా పార్టీని నడపటం కూడా కష్టమేనన్న ధోరణిలో ఆయన ఉన్నారు. ముఖ్యమైన స్థానాలపైనే... ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఖచ్చితంగా జనసేన విజయం సాధించే స్థానాలపై దృష్టి పెట్టారంటున్నారు. కనీసం ముప్ఫయి నుంచి నలభై స్థానాలపై ఫోకస్ పెట్టాలని, అక్కడ విజయం సాధించగలిగితే టీడీపీ నుంచి ఆఫర్ ఎన్నికల తర్వాత అదే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా దూకుడుగానే ఉంది. చంద్రబాబు తమ పార్టీ గ్రాఫ్ పెరిగిందని విశ్వసిస్తున్నారు. వైసీపీ పై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతారని, జనసేన డిమాండ్లకు తలొగ్గకూడదని, అవసరమైతే ఒంటరిగానైనా వెళ్లాలన్న ధోరణిని ఆయన కనబరుస్తున్నారు. జనసేన పార్టీతో కొందరు మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలిసింది.