విశాఖపట్టణం, జూలై 15,
విశాఖ మహా నగరాన్ని ఎన్నిసార్లు సందర్శించినా.. టూరిస్టులు మరోసారి వచ్చేందుకు మొగ్గు చూపుతుంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త పర్యాటక ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా విభిన్న టూరిస్ట్ స్పాట్‌లు కనువిందు చేస్తున్నాయి. సువిశాల సాగరతీరం.. సబ్‌మెరైన్ మ్యూజియం, ఎదురుగా టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం.. కొత్తగా సిద్ధమవుతున్న సీ హారియర్.. ఇలా ఎన్నో విశిష్టతలతో అలరారుతోంది. ఇప్పుడు కాస్త శ్రమిస్తే అదే జాబితాలో మరో బెస్ట్ స్పాట్ సిద్ధంగా ఉంది. 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో తూర్పు నావికాదళ ప్రధాన స్థావరమైన విశాఖను దెబ్బతీసేందుకు ప్రయత్నించి జలసమాధి అయిన పాకిస్తాన్ సబ్‌మెరైన్ పీఎన్‌ఎస్ ఘాజీ.. భిన్నమైన అంతర్జాతీయ టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన ఈ యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసి.. భారత్ పాకిస్తాన్ మధ్య తక్కువ రోజుల్లో జరిగిన అతిపెద్ద యుద్ధమిది. బంగ్లాదేశ్ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్) నుంచి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) విడిపోయి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. తూర్పు పాక్‌కు భారత్ మద్దతు ప్రకటించడంతో పాకిస్తాన్.. మన దేశంపై దాడులకు పాల్పడింది. భారత్, పాక్ బలగాలు తూర్పు, పశ్చిమ దిక్కుల్లో తలపడ్డాయి.పశ్చిమ ప్రాంతం వైపు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆపరేషన్ ట్రై డెంట్ పేరుతో భారత నావికా దళం కరాచీ ఓడరేవుపై చేసిన దాడిలో డిస్ట్రాయర్ పీఎన్‌ఎస్ ఖైబర్, పీఎన్‌ఎస్ మహాఫిజ్ మునిగిపోగా, పీఎన్‌ఎస్ షాజహాన్ పాక్షికంగా దెబ్బతింది. మరోవైపు.. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను విశాఖలో రంగంలోకి దించారు. పాకిస్తాన్ అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామి పీఎన్‌ఎస్ ఘాజీని పంపింది. విషయం తెలుసుకున్న భారత్ నావల్ కమాండ్.. ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ జలాంతర్గామిని రంగంలోకి దించింది. రాజ్‌పుత్ రాకను పసిగట్టిన ఘాజీ కుయుక్తులతో రాజ్‌పుత్‌ను మట్టికరిపించేందుకు దాడికి పాల్పడ్డారు. దాడిలో పాక్షికంగా దెబ్బతిన్న రాజ్‌పుత్‌లోని నావికాదళం ఘాజీపై సర్వశక్తులూ ఒడ్డి ఘాజీని విశాఖ తీరంలోని సాగరగర్భంలో కుప్పకూల్చారు. బంగాళాఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్ నేవీ ఆధీనంలోకి తెచ్చుకుంది. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే.
ఘాజీని సందర్శించేందుకు ఇలా తీసుకెళ్తారు.. విశాఖ తీరంలో ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ ధాటికి సైనికులతో సహా పీఎన్‌ఎస్ ఘాజీ జలసమాధి అయ్యింది. ఆ సమయంలో ఘాజీ నుంచి లభ్యమైన కొన్ని శకలాల్ని మాత్రమే విజయానికి గుర్తుగా తూర్పు నావికాదళం తీసుకొచ్చి భద్రపరచుకుంది. తర్వాత ఘాజీని అలాగే సాగర గర్భంలోనే విడిచిపెట్టేశారు. అనంతరం దాని గురించి పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత ఘాజీని పర్యాటక ప్రాంతంగా వినియోగించుకునేందుకు నేవీ, టూరిజం శాఖ సమాలోచనలు చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం టీయూ–142 యుద్ధ విమానాన్ని నేవీ అధికారులు ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో మరికొన్ని ప్రాజెక్టుల గురించి చర్చించినప్పుడు ఘాజీ ప్రతిపాదన వచ్చింది. తర్వాత దీనిపై కదలిక లేదు. ఇటీవల మరోసారి ఘాజీ అంశం తెరపైకి వచ్చింది. ఆర్‌కే బీచ్ నుంచి డాల్ఫిన్ నోస్ మధ్య ప్రాంతంలో 1.8 నాటికల్ మైళ్ల దూరంలో సముద్ర తీరంలో ఘాజీ జల సమాధి అయ్యింది. దాదాపు 30 మీటర్ల లోతులో ఘాజీ ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. దీని వద్దకు వెళ్లి ఘాజీని నేరుగా చూసే అవకాశం పర్యాటకులకు కల్పించనున్నారు. ఘాజీ ఎక్కడ ఉందో అన్వేషించేందుకు గతంలో టూరిజం శాఖ నేవీని సంప్రదించింది. దీనిపై స్పందించిన నావికా దళం ఇందుకోసం ఓ కెప్టెన్ సహా ఇద్దరు నేవీ అధికారులు, మరో ఇద్దరు టూరిజం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖలో పలు అడ్వెంచర్, బీచ్ టూరిజానికి సంబంధించిన ప్రాజెక్టులను టేకప్ చేసిన నగరానికి చెందిన ఓ సంస్థను ఈ కన్సల్టెన్సీ కోసం పర్యాటక శాఖని సంప్రదించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుందని టూరిజం వర్గాల సమాచారం.పీఎన్‌ఎస్ ఘాజీని ఓపెన్ టూరిస్ట్ స్పాట్‌గా చేయబోతున్న తరుణంలో దీన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. అయితే, తీరం నుంచి కొంత దూరం వెళ్లాక అక్కడి నుంచి 30 మీటర్ల లోతుకి వెళ్లాలంటే సాహసంతో పాటు ధైర్యం ఉండాలి. ముందుగా దీన్ని చూసేందుకు సర్టిఫైడ్ సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ (పాడీ) సంస్థ అం దించే అడ్వాన్స్‌డ్ ఓపెన్ ఆర్డర్ డైవర్ సర్టిఫి కెట్ పొందే వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వా లని భావిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖ కు ఈ అంశంపై మరోసారి లేఖ రాసినట్లు కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్తే.. విశాఖ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుంది.