అమరావతి జూలై 15
రాష్ట్రాలు అప్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు, షరతులు విధిస్తోందని, అనుమతి ఇచ్చేందుకు అనేక మెలికలు పెట్టి అదనపు భారాలు మోపుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందంటూ బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ తప్పుబట్టారు.కోవిడ్ నేపథ్యంలో ఏపీతోపాటు అనేక రాష్ట్రాలు అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. కేంద్రం కూడా ఇందుకు అతీతం కాదని చెప్పారు. కానీ రాష్ట్రాలు అప్పులు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారని, కేంద్రానికి మాత్రం షరతులు వర్తించవా.. అని ఆయన ప్రశ్నించారు. అనేక షరతులు పెట్టి రాష్ట్రాలు ప్రజలపై భారాలు మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు.అప్పుల విషయంలో కేంద్రానికి ఒక న్యాయం, రాష్ట్రానికి ఒక న్యాయం అమలు జరుగుతోందన్నారు. ఈ వాస్తవాలకు సమాధానం చెప్పకుండా పురందేశ్వరి రాష్ట్రాలపై విమర్శలు చేయడం హిపోక్రసి (కపటత్వం) అవుతుందని ఎద్దేవా చేశారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేరళ మాజీ మంత్రి ఎం.ఎ.బేబీ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు కూడా పాల్గొన్నారు.