YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీనియర్ మంత్రుల్లో అసంతృప్తి...

సీనియర్ మంత్రుల్లో అసంతృప్తి...

విజయవాడ జూలై 16,
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రులంతా సమానమే.  సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరికీ పెద్దగా అధికారాలు ఏమీ ఉండవు. అందుకే మంత్రులు ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా మాటకు ముందోసారి మాట చివరన మరోసారీ, జగన్ నామస్మరణ చేస్తుంటారని అంటారు. అది నిజమే. మొన్నీ మధ్య రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన, మంత్రులు, మాజీ మంత్రులు అంతా అదే పనిచేశారు.అఫ్కోర్స్ , పనిలో పనిగా టీడీపీ, జన సేన నాయకులను తిట్టి పోశారనుకోండి, అది వేరే  విషయం.  చివరకు ప్లీనరీ  పెట్టిందే అందుకు, అన్నట్లుగా మంత్రులు , మాజీలు జగనన్నకు చెవి విందు చేశారు, జగన్ రెడ్డి చిద్విలాసంగా నవ్వుకుంటూ, ఎంజాయ్ చేశారు.  అయితే, జగన్ రెడ్డి మంత్రివర్గంలో  మంత్రులంతా సమానమే అయినా, జూనియర్లు కొంచెం ఎక్కువ సమానమనే మాట ఒకటి కొత్తగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 2019 ఎన్నికలలో గెలిచిన  తర్వాత మంత్రి వర్గం కూర్పులో, ఒక ‘విచిత్ర’ ‘వికృత’ ప్రయోగం చేశారు. మంత్రి పదవులు ఆశించిన సీనియర్లు చాలా మందిని పక్కన పెట్టారు.  ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. అంతే కాదు, మంత్రి వర్గం పదవీ కాలాన్ని రెండు ముక్కలు చేశారు. మంత్రి వర్గం తొలి సమావేశంలోనే, మీరు పదవిలో ఉండేది రెండున్నర సంవత్సరాలే, రెండున్నర  సంవత్సరాలు అయిపోగానే, మీరంతా మాజీలు అయిపోతారు. సెకండ్ బ్యాచ్ మినిస్టర్స్ వస్తారని మొహమాటం లేకుండా మంత్రుల ముఖం మీదనే చెప్పేశారు.అనుకున్నట్లుగా ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలకు కాక పోయినా, ఓ మూడు  నాలుగు నెలలు కొవిడ్ ఎక్స్టెన్షన్ ఇచ్చి, ఏప్రిల్ 11 న  మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ చేశారు. అంతకు ముందే మంత్రులంతా రాజీనామా చేశారు. సో.. ముందుగా అనుకున్న విధంగా మంత్రులంతా మాజీలు అయిపోతారని ప్రచారం జరిగినా, చివరకు జగన్ రెడ్డి, 14 మంది కొత్తవారిని తీసుకుని. 11 మంది పాతవారికి  మళ్ళీ అవకాశం కల్పించారు.  అయితే, అలా మళ్ళీ తీసుకున్న వారిలో కొందరికి మాత్రమే ప్రాధాన్యత గల శాఖలను ఇచ్చారు, ఇంకొందరిని ఎందుకనో సైడ్ ట్రాక్ చేశారని, అంటారు. అలా సైడ్ ట్రాక్ చేసిన మంత్రులలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  అంతకు ముందు రాజధాని వ్యవహారాలను చక్కపెట్టే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక  శాఖను ఇచ్చిన బొత్సకు, సెకండ్ హాఫ్’లో ఆయనకు అస్సలు రుచించని, విద్యా శాఖను ఇచ్చారుఅదొకటి చాలదన్నట్లుగా, ఇప్పుడు అక్కడ కూడా పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నం ఏదో జరుగుతోందని అనుమానాలు  పార్టీ సర్కిల్స్ లో గుప్పు మంటున్నాయని  అంటున్నారు.  విద్యా శాఖ అధికారులు, మంత్రిని పక్కన పెట్టేసి తమ పని తాము చేసుకుపోతున్నారు. దాంతో  విద్యా శాఖలో ఏమి జరుగుతోందో, విద్యా శాఖ మంత్రికి తెలియని ఒక విచిత్ర పరిస్థితి నెలకొందని అంటునారు. జీవోలు వచ్చేస్తున్నాయి. ఎలా వస్తాయంటే.. అది అంతే, అనే సమాధానం వస్తోందని, మంత్రి అనుచరులు ముఖాలు మాడ్చుకుంటున్నారు. అంతేకాదు, మంత్రిగారి ఆదేశాలను అధికారులు పట్టిచుకోవడం లేదని అంటున్నారు.  ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పాఠశాలల విలీనంపై చాల పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో మంత్రి బొత్స విలీనం ప్రక్రియను వెంటనే అపేయాలని అధికారులను ఆదేశించారు. అయితే  అధికారులు మంత్రి ఆదేశాలను పట్టించుకోలేదు సరి కదా పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి రివ్యూ మీటింగ్ పెడితే, సగం మంది అధికారులు అసలు రాలేదు. వచ్చిన సగం మంది మంత్రి ఆదేశాలు అక్కడే చెత్త బుట్టలో పడేసి చక్కా పోయారని, సెక్రటేరియట్ వర్గాల సమాచారం.ఇలా మంత్రిని అధికారులు పట్టించుకోవడం లేందంటే, ముఖ్యమంత్రి నుంచి అలాంటి మౌఖిక ఆదేశాలు వచ్చి ఉంటాయని, లేదంటే, అధికారులు మంత్రిని అంతలా చిన్నచూపు చూడరని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు, అన్నట్లుగా బొత్స సహా మరి కొందరు సీనియర్ మంత్రులు తమకు విలువలేకుండా పోయిందనే కంటే, రాజకీయాల్లో ఇంకా పూర్తిగా బొడ్డయినా ఉడని కుర్ర మంత్రుల హవా చూసి కొంచెం చాలా అవమానం ఫీల్ అవుతున్నారని అంటున్నారు.  ఆరోగ్య మంత్రి విడదల రజనీ వయసు బొత్స సత్యనారాయణ అనుభవం అంత ఉండదు, అయినా, ఆమె రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీకి వెళ్లినా.. అధికారులు బారులు తీరి నిలబడుతున్నారు. సమీక్ష సమావేశం అంటే, చెప్పిన సమయానికంటే ముందుగానే వచ్చి చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. అదే బొత్సా వారో మరో సీనియర్ మంత్రో ఆకస్మిక తనిఖీ ఆలోచనే చేయలేని పరిస్థితి ఉందని, అందుకే,  వెళ్లి పదిమంది ముందు తమను తాము బయటేసుకోవడం ఎందుకనో ఏమో అలాంటి ఆలోచనలే చేయడం లేదని అంటున్నారు. సమీక్షలు కూడా మొక్కుబడిగా, పిచ్చాపాటి మాటలతో సరిపుచ్చడమే కానీ,  సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం అనేది మంత్రులు మరిచి పోయారని అంటున్నారు. అయితే బొత్స సహా కొందరు సీనియర్లను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని, ఈ విషయంపై   సీనియర్ మంత్రులు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అయితే, అలవి  కాని చోట అధికులం అనరాదు అనే ఇంగిత జ్ఞానంతో విద్యామంత్రి బొత్స మౌనంగా, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. అయితే. ముఖ్యమంత్రి ఎందుకు సీనియర్ మంత్రులకంటే జూనియర్ మంత్రులకు ప్రధాన్యత ఇస్తున్నారంటే, అభద్రతాభావం అనే సమాధానమే వస్తోంది. నిజానికి పార్టీలో, ప్రభుత్వంలో మరో అధికార బిందువు ఉండరాదనే జగన్ రెడ్డి చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను పొరుగు రాష్ట్రానికి పంపించారు, అలాగే బోత్సవంటి సీనియర్లను పక్కన పెట్టారని అంటున్నారు.

Related Posts