YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశం ఫ్యాన్ కింద ఉక్కిరి బిక్కిరి

ప్రకాశం ఫ్యాన్ కింద ఉక్కిరి బిక్కిరి

ఒంగోలు, జూలై 16,
ఆ నియోజకవర్గంలో అధికారపార్టీకి వారిద్దరు ప్రధాన నాయకులు. ఇద్దరూ పెద్ద పదవుల్లోనే ఉన్నారు. కాకపోతే కలిసి సాగే పరిస్థితిలేదు. అసమ్మతి నేతలను చేరదీసేవాళ్లు ఒకరు.. పట్టుకోల్పోకుండా ఎత్తుగడలు వేసేది ఇంకొకరు. ఇంకేముందీ నిత్యం రచ్చే. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుల్లో మానుగుంట మహిధర్ రెడ్డి ఒకరు. మాజీ మంత్రి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి మరోసారి కందుకూరు ఎమ్మెల్యే అయ్యారు. ముక్కుసూటిగా ఉండే మహీధర్‌రెడ్డి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. హైకమాండ్‌కు విధేయత ప్రకటించక పోయినా ప్రజలకు దగ్గరగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. దీంతో ఆయన దూకుడికి బ్రేక్‌ వేయాలని భావించారో ఏమో.. ఇదే ప్రాంతానికి చెందిన తూమాటి మాధవరావును ఎమ్మెల్సీని చేశారు. అప్పటి నుంచి కందుకూరు వైసీపీలో తకథిమితోం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.2019 ఎన్నికలకు ముందే మాధవరావు కందుకూరు వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయనకే వైసీపీ టికెట్‌ ఇస్తారని భావించినా.. చివరిక్షణంలో మహీధర్‌రెడ్డికి ఛాన్స్‌ దక్కింది. ఆ కారణంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందని చెబుతారు. పైగా అభివృద్ధి పనుల విషయంలో అధికారుల తీరును బహిరంగంగానే తప్పుపట్టేవారు మహీధర్‌రెడ్డి. ఆయన తీరు పార్టీలో కొంత చర్చకు దారితీసింది. ఇంతలోనే మాధవరావు ఎమ్మెల్సీగా రావడంతో చాలా మార్పు వచ్చింది. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. అయితే కోల్డ్‌వార్‌ బయటపడింది మాత్రం నెల్లూరు వైసీపీ ప్లీనరీలోనే. స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి మహీధర్‌రెడ్డి ప్లీనరీకి వెళ్లగా.. ఎమ్మెల్యేకు వైరివర్గంగా గుర్తింపు పొందిన వాళ్లను తీసుకెని మాధవరావు హాజరయ్యారు. ఇది పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.మహీధర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. కందుకూరుకు చెందిన వైసీపీ నేతలు కొందరు పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారట. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారట మహీధర్‌రెడ్డి. ఆ విషయాన్ని ప్లీనరీలో ప్రస్తావించారట. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందనేలా హెచ్చరించే ధోరణిలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.మహీధర్ రెడ్డి వ్యాఖ్యలు కొందరికి రుచించక పోయినా పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవటం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నట్టుగా కొందరు ఆయనతో ఏకీభవిస్తున్నారట. గతంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం జడ్పీ ఆఫీసులో అర్ధరాత్రి వరకూ నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేస్తున్నారట. ఈ వాదన తర్వాత రెండు వర్గాలు బలంగానే పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. కాకపోతే సమస్య శ్రుతిమించకుండా అధిష్ఠానం క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారట కార్యకర్తలు. వచ్చే ఎన్నికల్లో మహీధర్‌రెడ్డిని మార్చి తూమాటికి టికెట్‌ ఇస్తారో లేక.. ఆ జోలికి వెళ్లకుండా ఇద్దరినీ కలిసి పనిచేసుకోవాలని చెబుతారో కానీ.. ఈలోపు రెండు పవర్‌ సెంటర్స్‌ వల్ల గందరగోళానికి దారితీస్తోందని వాదించేవాళ్లు లేకపోలేదు. మరి.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts