విజయవాడ, జూలై 16,
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో, అందరికంటే అధికంగా కష్టాల్లో ఉన్న నాయకుడు ఎవరంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అనో .. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. అనో .అనుకుంటే అదిపొరపాటే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే, అందరికంటే అవస్థలు పడుతోంది.. అయోమయానికి గురవుతోంది. అవమానాలను ఫేస్ చేస్తోంది ఆ ఇద్దరూ కాదు. ఆ ఇద్దరికి ఎవరి వ్యూహం వారికుంది, ఎవరి ప్రణాళికలు వారికున్నాయి. కానీ, ఒక నిర్దిష్ట వ్యూహం, ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం ఏదీ స్పష్టంగా లేకుండా, అయోమయంగా దిక్కులు చూస్తున్న నాయకుడు,ఎవరైనా ఉన్నారంటే అది, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో అందరి కంటే అధికంగా మధన పడుతున్న నాయకుకుడు పవన్ కళ్యాణ్. ఆయనకు ఏవేవో ఆలోచనలున్నాయి.కానీ,ఆ ఆలోచనల ఆచరణకు అవసరమైన ఆలంబన లేదు. పవన్ కళ్యాణ్ కు పార్టీ వుంది, కానీ పార్టీ నిర్మాణం లేదు. అయినా కూడా నటుడిగా ఆయనకున్న ఇమేజ్ కారణంగానో లేక క్యాస్ట్ బేస్ ఆధారంగానో ఆయనకు కొంత ప్రజాబలం, ఓటు బలం వుంది. అయినా, రాజకీయాల్లో మాత్రం ఆశించిన రీతిలో పవన్ ముందడుగు వేయలేక పోతున్నారు. ఆయన అడుగులు ముందుకు పడడం లేదు. అదలా ఉంచి ప్రస్తుతంలోకి వస్తే, గడచిన నాలుగైదు నెలల్లో పవన్ కళ్యాణ్ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు.కానీ, ఆదే సమయంలో ఆయన ఇటు రాజకీయాల్లో, అటు అభిమానులు, ప్రజల్లో కూడా పలచన అవుతున్నారు. నిజానికి, సమయం సందర్భంగా లేకుండా ఆయన పొత్తుల తేనె తుట్టెను కదిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానంటూ చాలా గంభీర ప్రకటన చేశారు. అంతే కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంచేందుకు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించే బాధ్యత కూడా ఆయన ఎంతో విశ్వాసంగా భుజానికి ఎత్తు కున్నారు. అలాగే, బీజేపే జాతీయ నాయకత్వం ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చుస్తున్నానని మరో పొంతన లేని ప్రకటన చేశారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు, బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన్ని పిలిచిందీ లేదు. మాట్లాడిందీ లేదు. ఎప్పుడో మూడు నెలల క్రితం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ కోరారు. కానీ ఇంతవరకు, ప్రధాని కార్యాలయం నుంచి జవాబు లేదు. ఒక్క ప్రధాని మోడీ మాత్రమే కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా ఆ పార్టీ జాతీయ నాయకులు ఎవరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. బీజేపీ నాయకులు ఎవరూ పవన్ ఆశించిన రోడ్ మ్యాప్ ఊసే ఎత్తడం లేదు. అయితే రాష్ట్ర నాయకులు మాత్రం మీడియా చర్చల్లో ఇప్పటికీ, జనసేనను మిత్ర పక్షం గానే, పేర్కొంటున్నారు. ఇద్దరం కలిసి దుమ్ము దులుపుతామని గంభీర ప్రకటనలు చేస్తున్నారు. అందుకే, రాజకీయ విశ్లేశకులు ఒకరు, రాష్ట్రంలో బీజేపీకి ఎదిగే అవకాశం, ఆశ రెండూ లేవు కాబట్టి తమ లాగే, జనసేన కూడా ఎదగరాదని అనుకుంటున్నట్లుదని అన్నారు. సరగాగానే కావచ్చును ఆయన, బీజేపే ధోరణి. వెనకటికో బాల్య వితంతు బామ్మ గారు, కొత్త పెళ్లి కూతురును,నాకు లాగా వర్ధిల్లమని దీవించి నట్లుందని,అన్నారు. అదే విధంగా బీజేపీ మిత్ర పక్షం ముసుగులో జనసేన ఎదుగుదలకు అడ్డుపడుతున్నట్లు ఉందని అంటున్నారు.అదొకటి అలా ఉంటే, జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటనలలో పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా అయినా పలకరించ లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన సందర్భంగా, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని, జన సైనికులు రోడ్డెక్కి మరీ డిమాండ్ చేశారు. ప్రదర్శనలు నిర్వహించారు. అయినా, నడ్డా ఆ డిమాండ్ ను అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర పర్యటనలో ఎక్కడా నడ్డా బీజేపీ, జనసేన పొత్తు గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. అసలు పవన్ కళ్యాణ్ పేరు కూడా నడ్డా ప్రస్తావించలేదు. అలాగే, పుండు మీద కారం చల్లిన విధంగా, ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు శత జయంతి ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యకమానికి, చిరంజీవి సహా చాలా మందికి ఆహ్వానాలు అందాయి, కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం పిలుపు రాలేదు. అంతే కాదు, ప్రధాని మోడీ స్వయంగా చిరంజీవి దగ్గరకు వెళ్లి, ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించారు. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ ను హర్ట్ చేసిందని, అంటున్నారు. పవన్ కళ్యాణ్ మరో సోదరుడు, నాగ బాబు, అల్లూరి జయంతి వేడుకల స్టేజి మీద ఒక్క చిరంజీవి తప్ప అందరు అద్భుతంగా నటించారని, ట్వీట్ చేసి, వివాదానికి తెర తీశారు. జనసేన పార్టీలో క్రియాశీలంగా ఉన్న నాగబాబు, ప్రధానిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే, వివాదంగా మారాయి. నాగబాబు వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుందని అంటున్నారు. అదలా ఉంటే, మరీ రీసెంట్ గా బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ను మరోమారు అవమానించిందని , జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. బీజేపీ/ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్ము ఏపీ పర్యటన సందర్భంగానూ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను పట్టించుకోలేదు.ప్రాక్టికల్ గా కాకపోయినా టెక్నికల్ గా జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అదీ కాక పోయినా, మిత్ర పక్ష అధ్యక్షునిగా అయినా, ఆయన్ని పిలిస్తే, బీజేపీకి పోయేదేమీ లేదు. కానీ, పిలవలేదు. ఇది కూడా జనసేన అధినేత గుండెల్లో గుచ్చుకుందని, ఇలా అవమానాలు భరిస్తూ బెజేపీతో కలిసి కాపురం చేసేకంటే, వదిలేసి తమదారి తాము చుకోవడం ఉత్తమమనే ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ తమ సన్నిహితుల వద్ద, బీజేపీకి తమ అవసరం లేదేమో, అని అన్నట్లు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ మరోమారు, బీజేపీతో కటీఫ్ కు రంగం సిద్దచేసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. దసరా పండగ తర్వాత,అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర యాత్ర మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అదే సమయానికి బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్, మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ క్యాడర్ ముందు మూడు ఆప్షన్స్ ఉంచారు. ఇక ఇప్పుడు, రాష్ట్రంలో వైసీపీ, జగన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించేందుకు, 2024 ఎన్నికలలో, తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే నాల్గవ ఆప్షన్ ముందుకు తెస్తున్నారని అంటున్నారు. నిజం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నా, జనసేన అసెంబ్లీలో అడుగు పెట్టలన్నా అది టీడీపీతో పొత్తుతో మాత్రమే సాధ్యమవుతుంది, కానీ బీజేపీతో పొత్తు వలన అయ్యే పని కాదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్ అక్టోబర్ యాత్రకు ముందే, కమలానికి గుడ్ బై చెప్పి సైకిల్ తో జట్టు కటడం ఖాయమని అటు పార్టీ వర్గాలు, ఇటు రాజకీయ పరిశీలకులు కూడా గట్టిగా భావిస్తున్నారు.