హైదరాబాద్, జూలై 16,
కేంద్రంతో పోరు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకే కదులు తున్నారు. జాతీయ స్థాయిలో ఏ పార్టీ కలిసి రాకపోయినా ఆయన మాత్రం వెనకడుగు వేయడంలేదు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్ ను గద్దె దింపాల్సిందే అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు.దేశంలో సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే అన్న నిశ్చయంతో ఉన్న కేసీఆర్ ఆ దిశగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు తాజాగా మరో ప్రయత్నం ప్రారంభించారు. దేశంలో ప్రమాదంలో పడిన ఫెడరల్, సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించడమే ధ్యేయంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీల నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో విపక్ష నేతలతో శుక్రవారం ఫోన్ లో సంభాషించారు.దేశాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తున్న కేంద్రం వైఖరిని ప్రజలలో ఎండగట్టడమే లక్ష్యంగా కలిసి వచ్చే పార్టీలను సమన్వయం చేసుకుంటూ మోడీ సర్కార్ పై సమర శంఖాన్ని పూరించడానికి తన సన్నాహాలను కేసీఆర్ మరింత వేగవంతం చేశారని తేటతెల్లమౌతోంది. ఈ నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల వేదికగా మోడీ సర్కార్ పై పోరు మొదలు పెట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. పార్లమెంటు వేదికగా విపక్షాలన్నీ ముక్తకంఠంతో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించేలా వ్యూహం రూపొందించడమే లక్ష్యంగా ఆయన శుక్రవారం పలు పార్టీల నేతలతో జరిపిన సంభాషణ సాగిందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో, ల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో, తమిళనాడు సీఎం స్టాలిన్ సన్నిహితులతో, బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్ తో , యుపీ విపక్ష నేత, జేడీయూ అధినేత అఖిలేశ్ యాదవ్ తో, మరాఠా యోధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఈ దిశగా సమాలోచనలు జరిపిన కేసీఆర్ మరో సారి జాతీయ స్థాయిలో బీజేపీయేతర నేతలతో ఫోన్ లో ముచ్చటించారు. ఇతర జాతీయ విపక్ష నేతలతో స్వయంగా ఫోన్లో స్వయంగా మాట్లాడిన సిఎం కెసిఆర్. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై కేసీఆర్ ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల సీఎంలు విపక్ష పార్టీల నేతలు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. అటు వరదలనుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూనే ఇటు బిజెపి అప్రజాస్వామిక విధానాల విపత్తు నుంచి దేశాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయిలో పోరాటనానికి విపక్షాల ఐక్యత కోసం కేసీఆర్ ప్రయత్నాలు సాగిస్తున్నారు.