విజయవాడ, జూలై 18,
ఎవరన్నా అవసరంలో వున్నపుడు మద్దతుకోసం అడుగుతారు. మనకు వీలున్నంతవరకూ ఇబ్బంది లేదనిపిస్తే ఓకే అంటాం. ప్రస్తుత రాజకీయపరిస్థితుల్లో బిజెపి, వైసీపీ స్నేహం ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్‌కు చాలా అవసరం గనుక ఉప రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్ధిగా బిజెపి జగదీప్ దినకర్‌ను ప్రకటించగానే ఇక్కడనుంచి జగన్ ఓకే అని మద్దతు ప్రకటించేశారు. అంతేకాదు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జగదీప్‌గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం ఏకంగా హిందీలో ట్వీట్ చేయడమూ అయిపో యింది. రైతు బిడ్డ జగదీప్ ధనకర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించినందుకు తనకు చాలా సంతోషం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. జగదీప్ ధన్‌కర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయనకు మద్దతు తెలిపింది వైఎ స్సార్సీపీ.వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కర్ కే జైకొట్టింది. రాష్ట్రపతి ఎన్నిక ల్లోనూ బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. అయితే అందరికంటే ముందుగానే జగన్ మద్దతు తెలియజేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్త వానికి జగన్ పార్టీ తరఫున ఇంకా ఓకే అనకపోయినా, విజయసాయి రెడ్డి మద్దతు ప్రకటన పార్టీపరంగా చెప్పినట్టేనని విశ్లేష కులు అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. రాజ్యసభలో వైసీపీకి ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ అధికారిక ప్రకటనగానే భావించవచ్చు.ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు విషయంలో కొంత వివాదం జరిగిన విషయం తెలిసిందే. మేం అడగకుండానే వైసీపీ మద్దతు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై విరుచు కుపడిన వైసీపీ నేతలు బీజేపీ హైకమాండ్ కోరితేనే తాము మద్దతు తెలిపినట్లు ఎదరుదాడికి దిగారు. ఆ తర్వాత ఈ అంశంపై కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కూడా స్పందించారు. ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైసీపీని కోరామని స్పష్టంచేశారు. సత్యకుమార్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐతే ఇప్పుడు మాత్రం అడగకుండానే జగదీప్ ధన్‌కర్‌కి వైసీపీ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక, తెలంగాణ అధికార పక్షం టిఆర్ ఎస్ విషయానికి వస్తే, నరేంద్ర మోదీయే టార్గెట్‌గా కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు కాకుండా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతునిచ్చారు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటార న్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా విపక్షాల అభ్యర్థికే మద్దతు తెలుపుతారా? లేదంటే బీజేపీ రైతు బిడ్డగా చెబుతున్న జగదీప్‌కు జైకొడతారా? అన్నది తెలియాల్సి ఉంది.