కాకినాడ, జూలై 18,
డిఫెన్స్‌లో పడ్డ ఆ ఎమ్మెల్యే.. సెల్ఫ్‌గోల్ చేసుకున్నారా? ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సీన్‌లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తంగా వ్యహరించారా? రోజంతా హైడ్రామా నడిచిన వ్యవహారంలో కొండను తవ్వి ఎలుకను పట్టుకుంది ఎవరు?పోలీస్ స్టేషన్‌లో నేలపై పరుపు వేసుకుని నిద్ర పోతున్నది ఎవరో కాదు.. కోనసీమ జిల్లాలోని కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి. ఈ సీన్‌కు వేదిక రావులపాలెం పోలీస్ స్టేషన్. రెండు రోజులు ఇక్కడ నాటకీయ పరిణామాలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఖాకీలపై ఖద్దరు పైచెయ్యి సాధిస్తుందా? లేక ఖద్దరుపై ఖాకీ మాటే నెగ్గుతుందా అనే అంతా ఆరా తీశారు.రావులపాలెం మండలం గోపాలపురంలో అంబేద్కర్ ఫొటోలతో టిఫిన్ ప్లేటుల్లో ఆహార పదార్థాలు ఇవ్వడంతో ఈ నెల 5న గొడవ జరిగింది. ఆ కేసులో 18 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు పోలీసులు. రెండు నెలల క్రితం అమలాపురంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని.. గోపాలపురం ఘటనలో ఖాకీలు చాలా వేగంగా స్పందించారు. శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు చేయాల్సిందంతా చేశాయి. రెండు వైపులా వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు హల్‌చల్ చేశాయి. అయితే ఈ ఎపిసోడ్‌లో వైసీపీ వెనకపడిందని అనుకున్నారో ఏమో.. ఐదు రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి .వైసీపీ ప్లీనరీలో బిజీగా ఉండటంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో పట్టించుకోలేదని కేడర్ క్వశ్చన్ చేయకుండా.. జగ్గిరెడ్డే అడ్వాన్స్ అయిపోయారని టాక్. సమస్యను ప్రతిపక్షాలు బాగానే టేకాఫ్ చేశాయని.. ఆ సీన్‌లో మనం ఎక్కడా లేమని కొందరు చెప్పడంతో ఎమ్మెల్యే కొత్తగా ఆలోచించారట. ఈ ఘటనలో సీఐ, ఎస్‌ఐల పాత్రను తప్పుపడుతూ.. వారిని సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చుట్టూ ఉన్నవాళ్లు చెప్పారట. అదేదో బాగుందని అనుకున్నారో ఏమో.. అప్పటికప్పుడు రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేస్తేగానీ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని రాత్రి అక్కడే పడుకున్నారు.ఎమ్మెల్యేకి మద్దతుగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు రావడం.. డీఎస్పీ ఎమ్మెల్యేతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమస్య తీవ్రత పెరిగింది. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్‌రెడ్డి మాత్రం.. ఆ ఘటనలో పోలీసుల తప్పు లేదని.. సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేసేది లేదని తేల్చి చెప్పేశారట. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడే ఉద్దేశం కూడా లేదని ఎస్పీ స్పష్టం చేశారట. మీ పొలిటికల్ ఇమేజ్ కోసం మమ్మల్ని బలిచేయొద్దని గట్టిగానే చెప్పారట ఎస్పీ. దాంతో జగ్గిరెడ్డి కొంత ఇబ్బంది పడినా.. మధ్యలో పోరాటాన్ని వదిలేస్తే ఇరకాటంలో పడతామని అనుకున్నారో ఏమో.. పోలీసుల తీరు వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందనే అంశాన్ని చర్చకు పెట్టారు. పైగా గొడవ జరిగింది జగ్గిరెడ్డి సొంతూరులోనే కావడంతో వెనక్కి తగ్గలేదు.చివరకు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు రావులపాలెం వచ్చారు. ఎస్పీ మాత్రం రాబోనని చెప్పేశారట. పలు దఫాల చర్చల తర్వాత సీఐ, ఎస్‌ఐలను ఈ కేసులో జోక్యం చేసుకోకుండా చూస్తామని.. అడిషనల్ ఎస్పీతో విచారణ చేయిస్తామని డీఐజీ హామీ ఇచ్చారు. దాంతో జగ్గిరెడ్డి మెత్తబడ్డారట. సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేయాలనే డిమాండ్ నెరవేరకపోయినా.. కింద పడ్డా తనదే పైచెయ్యి అన్నట్టుగా సర్దుకుపోయారట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. తెగేవరకు లాగకుండా మధ్యలోనే సమస్యకు ఎండ్ కార్డు వేయడంతో ఎమ్మెల్యే సెల్ఫ్‌గోల్ వేసుకున్నారనే చర్చ ఊపందుకుంది.