గుంటూరు, జూలై 18,
రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నా.. ఆ వైరం పోదు. కలిసి సాగలేరు. వెళ్దామన్నా ఇగోలు.. పాత గొడవలు అడ్డొస్తాయి. గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య అదే జరుగుతోందట. పరస్పరం పైచెయ్యి సాధించేందుకు వారు వేయని ఎత్తుగడలు లేవంటున్నారు పార్టీ నాయకులు. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కథా?గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్‌గానే ఉంటాయి. జిల్లాలోని కీలక నేతలంతా నివాసం ఉండేది ఇక్కడే. అందుకే పశ్చిమ అనగానే అందరి దృష్టీ పడుతుంది. 2014 ఎన్నికల్లో వెస్ట్ నుంచి టీడీపీ తరఫున మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, వైసీపీ నుంచి లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మోదుగుల గెలిచారు. ఐదేళ్లపాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తనకు ఎమ్మెల్యేగా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తి మోదుగులలో ఉండేది. ఆ క్రమంలోనే టీడీపీని వీడి ఆయన వైసీపీలో చేరిపోయారు. కానీ.. లేళ్ల అప్పిరెడ్డితో సఖ్యత కుదరలేదు. వారి మధ్య అప్పటి నుంచి ఆధిపత్యపోరాటమే. అదే ఈ మూడేళ్లుగా రకరకాలుగా కొత్త పుంతలు తొక్కుతోంది.2019 ఎన్నికల్లో గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు మోదుగుల. స్వల్ప తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ తరఫున చంద్రగిరి ఏసురత్నం పోటీ చేసి ఓడిపోయారు. జగన్‌కు సన్నిహితంగా ఉండే అప్పిరెడ్డికి 2019లో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా.. పార్టీ అధికారంలోకి వస్తే మంచి గుర్తింపు ఇస్తామన్న హామీ లభించింది. దాంతో ఆయన పోటీ చేయలేదు. పవర్‌లోకి రాగానే అప్పిరెడ్డిని ఎమ్మెల్సీని చేశారు సీఎం జగన్. ఎంపీగా ఓడిన మోదుగుల చేతిలో ఎలాంటి పదవి లేక డీలా పడ్డారు. ఏదో ఒక పదవి ఇస్తారన్న ఆశల్లోనే మూడేళ్లు గడిచిపోయింది.తనకు బంధువైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ సభ్యుడిగా జగన్ అవకాశం కల్పించడంతో మోదుగులకు నిరాశ తప్పలేదు. దీనికితోడు గుంటూరు వైసీపీలో మొదటినుంచి అప్పిరెడ్డి వైసీపీ హవా నడుస్తోంది. ఆయనకు బలమైన వర్గం కూడా ఉంది. మోదుగుల కూడా తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. దాంతో ఇద్దరి మధ్య అస్సలు పడటం లేదు. గుంటూరులో పోలీస్ పోస్టింగుల అంశంలో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. ఓ సీఐ పోస్టింగ్ కోసం ఇద్దరూ చెరొకరి పేరును సిఫారసు చేశారు. వైసీపీ ప్లీనరీలో జరిగిన ఘటన అప్పిరెడ్డి, మోదుగుల మధ్య విభేదాలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. ప్లీనరీలో మోదుగుల చేసిన కామెంట్స్ చుట్టూనే అంతా ఆరా తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా సెలక్షన్‌తో కాకుండా ఎలక్షన్‌లో గెలవాలని అప్పిరెడ్డిని ఉద్దేశించి అన్నారు మోదుగుల. దీనికి అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైఎస్‌ఆర్ సమయంలో కొందరు కాంట్రాక్టు పనులు దక్కించుకుని తర్వాత పక్కకుపోయారని.. ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీలోకి వచ్చారని దెప్పి పొడిచారు. ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి.. తర్వాత వైసీపీకి జై కొట్టారు. ఆయనకు ఏసురత్నంతో పొసగడం లేదు. ఇటు చూస్తే పశ్చిమకే చెందిన అప్పిరెడ్డి, మోదుగుల పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. దీంతో పశ్చిమ వైసీపీ రాజకీయాలు గరం గరంగా మారుతున్నాయి. మరి.. ఎన్నికల నాటికి ఈ ఆధిపత్యపోరాటం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.