అనంతపురం, జూలై 18,
పాలన బాగుంటే అందరూ ఆదరిస్తారు. పాలన బాగుంటే అందరికీ గౌరవం లభిస్తుంది. కబుర్లు చెబుతూ పబ్బం గడుపు దామనుకుంటే అవమానాలకు సిద్ధం కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదన్నది మరోసారి రుజువయింది. గడప గడపకు అనే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల నుంచి తిరుగుబాటు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న పథకాల ఫలాల గురించి వాకబు చేయడా నికి వెళుతోన్నవారికి ప్రజల నుంచి తిట్ల దండకమే పడుతోంది. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని శెట్టిపల్లి తండాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. వితంతు పింఛన్‌ను రద్దు చేసినందుకు ఓ గిరిజన మహిళ రగిలిపోయింది. తన ఇంటి వద్దకు ఇంకోసారి వస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించింది. పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాకు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి శంకర నారాయణ గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్లారు. ఈ క్రమంలో లలితాబాయి ఇంటి వద్దకు చేరుకోగానే ఆమె బంధువులు పింఛన్ రద్దు విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఇంతలో లలితా బాయి అనే మహిళ బయటకు వచ్చి తన భర్త ఆనందనాయక్ పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, అప్పటి నుంచి తనకు వితంతు పింఛన్ వచ్చేదని తెలిపింది.
స్థానిక వైసీపీ నాయకులు తనకు పింఛన్ రాకుండా చేశారని, 11 నెలల నుంచి పింఛన్ అందడంలేదని ఎమ్మెల్యేకి వివరిం చింది. అంతా విన్న ఎమ్మెల్యే, తరువాత చూద్దాంలే.. అని చెప్పి, తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లిపోయారు. దీంతో లలితా బాయి రగిలి పోయింది. ఏమిచ్చి పోగొట్టుకున్నారని మా ఇంటికాడికి వచ్చినార్రా.. ఇంకోసారి మా ఇంటి ముందుకొస్తే చెప్పుతో కొడతా. ఒకసారి మా ఇంటిని చూడండిరా..అని ఆగ్రహం వ్యక్తంచేసింది. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి రా.. అని ఎమ్మెల్యేపై తొడ కొట్టింది.శెట్టిపల్లికి చెందిన లలితాబాయి, ఆనందనాయక్ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆనంద్ పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త చనిపోయాక లలితాబాయి కూలి పనులకు వెళ్లి బిడ్డలను పోషించింది. స్థానికంగా పనులు లేనప్పుడు బెంగళూరుకు వలస వెళ్లి వస్తుంటుంది. స్థానికంగా ఉండదన్న సాకుతో వైసీపీ నేతలు ఆమె పింఛన్‌ను రద్దు చేయించినట్లు తెలిసింది.ఈ విషయాన్నే విన్నవించినా ఎమ్మెల్యే తేలిగ్గా తీసుకోవడంతో లలితాబాయి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.