విశాఖపట్టణం, జూలై 18,
పవన్ కల్యాణ్ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్లే కనపడుతుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తాను ముఖ్యమంత్రి అవుతానని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. పొత్తుల కోసం పాకులాడకుండా జనంలోకి వెళ్లి అత్యధిక స్థానాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మండపేటలో జరిగిన బహిరంగ సభలో కూడా అభ్యర్థులు ఎవరైనా వారిని కాకుండా పవన్ కల్యాణ్ చూడమని ఆయన కోరడం వెనక కూడా అదే అర్థం దాగి ఉంది. 2024లో జనసేనకు అధికారం ఇవ్వాలని ఆయన కోరుతున్నా, ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నారు. కొద్ది నెలలుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ధోరణిలో స్పష్టమైన మార్పు కన్పిస్తుంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నా, తనను నమ్మమని ఆయన కోరుతున్నారు. అవసరమైతే 2008 నుంచి తన రాజకీయ వ్యవహార శైలిని పరిశీలించమని పవన్ కల్యాణ్ ప్రజలను కోరుతున్నారు. గత ఎన్నికల్లో తాను రెండుచోట్ల ఓటమి పాలయ్యాయని అయినా తాను ప్రజా సమస్యల కోసమే పోరాడుతున్నానన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నారు. ఒకరకంగా సింపతీని క్రియేట్ చేసుకున్నట్లే కన్పిస్తుంది.మరోవైపు గతంలో ఆయన తన ఉపన్యాసాల్లో టీడీపీ గురించి ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఊసే ఎత్తడం లేదు. తనను మాత్రమే గెలిపించాలని కోరుతున్నారు. అటు విమర్శలు చేయడం లేదు. ఇటు పొత్తుల అంశాన్ని కూడా ప్రస్తావించడం లేదు. అది రాయలసీమ అయినా, కోస్తాంధ్రలోనైనా, తూర్పు గోదావరి జిల్లాలోనయినా ఆయన పార్టీ ఆవిర్భావ సభలో చెప్పినట్లు వైసీపీ వ్యతిరేకత ఓట్లన్నీ ఏకం చేస్తానని చెప్పడం లేదు. తన పార్టీని గెలిపిస్తారో? లేదో? మీరే ఆలోచించుకోవాలని ఆయన ప్రజలనున కోరుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రెండు బీజేపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏరప్ాటు చేయడం. మూడో ఆప్షన్ జనసేన, బీజేపీ, టీడీపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కానీ పవన్ ఇప్పుడు ఒక్క ఆప్షన్ నే ఎంచుకున్నట్లు కనపడుతుంది. అది తొలి ఆప్షన్ మాత్రమే. ఆయన ధోరణి, ప్రసంగాల తీరు చూస్తుంటే ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు కనపడుతుంది. అప్పుడే తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోగలనని, పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా అందులో బాసిజం ఉంటుందని, తమ మాట ఎంతవరకూ చెల్లుతుందోనన్న ఆలోచనకు ఆయన వచ్చినట్లున్నారు. అందుకే ఎప్పటికైనా జనసేన అధికారంలోకి రాకపోదా? అన్న ఆశతో ఉన్నారు.