శ్రీకాకుళం, జూలై 18,
వైసీపీ అధినేత జగన్ తీరుతో పార్టీలో అసమ్మతి భగ్గుమంటున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన కేబినెట్ లో సీనియర్లు చిటపటలాడడమే కాదు.. పార్టీలో కూడా సీనియర్లు పక్క చూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా.. వైసీపీ సీనియర్లు పార్టీ తీరు పట్లా, అధినేత వ్యవహార శైలి పట్లా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారే స్వయంగా తమ ఆంతరంగికుల వద్దా ఆ అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నారు. వైసీపీలో జూనియర్, సీనియర్ అన్న తేడా లేదు. అందరి పరిస్థితీ ఒక్కటే ఏరు దాటే వరకూ ఓడ మల్లయ్య... ఏరు దాటేకా బోడి మల్లయ్య అన్న చందమే. మరీ ముఖ్యంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత కేబినెట్ లోనూ, పార్టీలోనూ కూడా సమస్యల చిక్కులు అధికమయ్యాయి. జగన్ అయిష్టంగా అయినా అనివార్యంగా కొనసాగించాల్సిన మంత్రులకు కేబినెట్ లోనే కాదు.. వారి వారి మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులలో కూడా పలుచన అయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే పదవి ఆశించి దక్కక భంగపడిన నేతలు అప్పట్లో అసమ్మతి గళం వినిపించారు. ఆ తరువాత సముదాయించుకుని గతంలోలా పార్టీలో పని చేద్దామనుకున్నా.. అలా చేయలేని పరిస్థి తులను వారికి పార్టీ అధిష్ఠానమే కల్పిస్తోందని వైసీపీ శ్రేణుల్లోనే బలంగా వినిపిస్తోంది.అందుకు పలు ఉదాహరణలను కూడా వారు చూపుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత కిళ్లి కృపారాణిది అయితే మరో ప్రత్యేక సమస్య. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగి.. జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొంది కేంద్ర మంది పదవిని అలంకరించిన ఆమె హస్తం నుంచి వైసీపీలో చేరారు. ఆమెను జగన్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి జిల్లా అధ్యక్ష బాధ్యతలు సైతం అప్పగించారు. అక్కడి దాకా బానే ఉంది. ఆయితే ఆమెకు వాగ్దానం చేసిన విధంగా ఏ నామినేటెడ్ పోస్టూ ఇవ్వలేదు.అయినా సద్దుకుని పార్టీ కోసం పని చేయాలని భావించిన ఆమెకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత కష్టాలు చుట్టుముట్టాయి. పరాభవాలు ఎదురౌతున్నాయి. తనను పొమ్మన లేక పొగబెట్టినట్టుగా పార్టీ సీనియర్లు వ్యవహరిస్తున్నారని ఆమె ఎటువంటి దాపరికం లేకుండానే చెబుతున్నారు. కేబినెట్ పునర్వ్యవ స్థీకరణలో మంత్రి పదవి దక్కించుకున్న ధర్మాన ప్రసాదరావు తనను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తూ అవమానిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గౌరవం లేని పార్టీలో ఉండటం కంటే వదిలి వెళ్లడమే మేలని ఆమె తన అనుచరులదగ్గరు ఓపెన్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం ఇటీవల సీఎం జగన్ జిల్లా టూరులో ఆమెకు జరిగిన అవమానమే నంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఆహ్వానం పలికేందుకు వెళుతున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తాను కేంద్ర మాజీ మంత్రినని.. వైసీపీ సీనియర్ నాయకురాలినని చెప్పినా వారు వినలేదు. లోపలికి అనుమతించలేదు. దీంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. తనకు జరిగిన పరాభవం వెనుక ధర్మాన ఉన్నారని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి సైతం ఆమెను తొలగించడంతో.. వైసీపీలో ఇక కొనసాగడం తనకు సాధ్యం కాదని ఆమె బహిరంగంగానే చెబుతున్నారు. తెలుగుదేశం గూటికి చేరాలన్న ఆసక్తి ఉన్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.