విజయవాడ, జూలై 19,
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటించడం, వాయిదా వేయడం ఏపీ సర్కార్ కు ఒక ఆనవాయితీగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా అసెబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ లేదా అక్టోబర నెలలలో నిర్వహిస్తుంటారు. అయితే జగన మాత్రం ఈ సారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను జూలైలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. అంతా నిజమే కాబోలు అనుకున్నారు. అయితే ఇప్పుడు సమవేశాలు జూలైలో కాదంటున్నారు. ఏలిన వారు ఏం చెబితే అది వినాలి అంత కంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు?ఇంతకీ జగన్ అసలు అసెంబ్లీ సమావేశాలను జూలైలోనే నిర్వహించాలని ఎందుకు భావించారు? మళ్లీ అంతలోనే ఎందుకు వాయిదా వేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం జగన్ పార్టీ శ్రేణుల నుంచే వస్తోంది. జగన్ కేబినెట్ లో మంత్రి గుడివాడ అమర్నాద్ ఉరుములేని పిడుగులా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోనే మళ్లీ మూడు రాజథానుల బిల్లును తీసుకువస్తామని ప్రకటించారు. అసెంబ్లీ వాయిదాకు ఆ బిల్లు రూపకల్పన ఇంకా పూర్తికావడమే కారణమై ఉండవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.వాస్తవంగా ఈ మూడేళ్లలో జగన్ సర్కార్ ఎన్నడూ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పట్ల శ్రద్ధ చూపలేదు. ఇక తప్పదు నిర్వహించి తీరాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మళ్లీ వాయిదా వేసింది. ఈ సారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులు పెట్టబోతున్నట్లు మీడియా సాక్షిగా జగన్ సర్కార్ పలు లీకులు ఇచ్చింది. కీలకం అనగానే జగన్ సర్కార్ కు అన్నిటి కంటే కీలకం, ప్రధానం, ప్రాముఖ్యం మూడు రాజధానులేనని తెలిసిందే. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటి నుంచి.. అంటే మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఉపసంహరించుకున్నప్పటి నుంచీ న్యాయపరమైన సలహాలు తీసుకుని మరో సారి ఆ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురావలన్న లక్ష్యంతోనే వైసీపీ సర్కార్ ఉంది.ఇటీవలి వైసీపీ ప్లీనరీలో కూడా తమ విధానం మూడు రాజధానులేనని విస్పష్ట ప్రకటన కూడా చేశారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు కూడా చెప్పరు. అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది.ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ఇంకా సుప్రీం కోర్టుకు వెళ్లలేదు. సుప్రీంలో సవాల్ చేసినా ఫలితం ఉండదన్న న్యాయ నిపుణుల సలహాతోనే జగన్ సర్కార్ సుప్రీం కు వెళ్లలేదని పరిశీలకులు అంటున్నారు. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఉన్న ఏకైక ఆప్షన్ అసెంబ్లీలో మరో సారి బిల్లు ప్రవేశ పెట్టడమే. అందుకోసమే ఈ నెలలోనే నిర్వహించాలని భావించిన అసెంబ్లీ వర్షాల సమావేశాలను వాయిదా వేశారని చెబుతున్నారు. పకడ్బందీగా బిల్లు రూపొందించి అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టడానికి జగన్ సర్కార్ నిర్ణయించుకుందనీ, అందుకే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వాయిదా వేసిందనీ విశ్లేషిస్తున్నారు.