వచ్చే ఎన్నికల్లో పశ్చిమలో వైసీపీ అభ్యర్థి వెలంపల్లేనా? సెంట్రల్‌లో వంగవీటి రాధాకృష్ణ, మల్లాది విష్ణుకు మధ్య సాన్నిహిత్యం ఉందా, లేదా? తూర్పులో యలమంచిలి రవి ఓకే.. బొప్పన భవితవ్యం ఎటు? అభ్యర్థులెవరైతేనేం.. ప్రస్తుతం నగర వైసీపీలో ఎన్ని‘కల్లోలం’ మొదలైంది. సిటీ సీటు కోసం పాట్లు పడుతున్న నాయకులు సరే.. ఎవరివైపు వెళ్లాలో తెలియక కార్యకర్తలు కలవరపడుతున్నారు.
నాయకుల విషయంలో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రకటన పార్టీశ్రేణుల్లో అసహనానికి దారితీస్తోంది. నియోజకవర్గంలో ఎవరు కార్యక్రమాలు చేపట్టినా తనకు పోటీ వస్తున్నారన్న అపోహతో వైసీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ తెరవెనుక నుంచి ఆ ప్రకటనలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదిహేను రోజుల వ్యవధిలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు ప్రకటనలు వెలంపల్లికి అనుకూలంగా విడుదల చేయడం ఇందులో భాగమే. కోరాడ విజయ్‌కుమార్‌కు, వెలంపల్లి శ్రీనివాస్‌కు వ్యాపారపరంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అకారణంగానే కోరాడకు నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు వెలంపల్లి చక్రం తిప్పుతున్నారని కార్యకర్తలు భావిస్తున్నారు. అలాగే, పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్న పోతిన వెంకటప్రసాద్ కూడా పార్టీ తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రసాద్ కూడా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. అయితే, జలీల్‌ఖాన్ ప్రాభవం ముందు నిలబడలేరన్న నమ్మకంతో అప్పట్లో ప్రసాద్‌ను పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మళ్లీ ప్రసాద్ చురుగ్గా వ్యవహరిస్తుండటంతో ఆయన్ను పోటీగా భావించిన వెలంపల్లిని పెద్దిరెడ్డి ద్వారా ఆ ప్రకటన చేయించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దాదాపు రెండేళ్ల క్రితం వెలంపల్లి శ్రీనివాస్ పార్టీలోకి వచ్చారు. అప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా పనిచేసిన ఆసిఫ్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మార్చి వెలంపల్లిని నగర అధ్యక్షుడిగా నియమించారు. దీంతో ఆసిఫ్ రేసులో వెనకపడ్డారన్న వార్తలు స్థానిక ముస్లింలలో ఇబ్బందిగా మారాయి. పార్టీలోకి వచ్చే ముందు వెలంపల్లికి ఎమ్మెల్సీ ఇస్తామని, ఇప్పుడు పెద్దిరెడ్డి ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేయించడంతో పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
నిన్నటివరకు తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్తగా పనిచేసిన బొప్పన భవకుమార్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. అనూహ్యంగా పార్టీలోకి యలమంచిలి రవి రావడంతో సీటు ఆయనకే దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భవకుమార్ కంటే రవికే రాజకీయంగా అనుభవం, ప్రజాదరణ ఉన్నా.. ఇప్పటివరకు కష్టించిన భవకుమార్ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది.
ఒకే ఒరలో రెండు కత్తులన్న చందంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఒకరికి ఇద్దరు నాయకులను ప్రోత్సహిస్తోంది వైసీపీ. మధ్య నియోజకవర్గ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా ప్రకటించారు. జగన్ పాదయాత్రలో రెండువేల కిలోమీటర్లు పూర్తిచేసిన సందర్భంగా రాధా తన అనుచరులతో కలిసి మే 13వ తేదీన ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలంతా విచ్చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి స్థానికంగా సీటు ఆశిస్తున్న మల్లాది విష్ణు రాలేదు. పైగా ఆ మరుసటి రోజు అదే సందర్భాన్ని పురస్కరించుకుని మరో కార్యక్రమాన్ని విష్ణు ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి రాధాకు ఆహ్వానం లేకపోగా, ఆయనతో విభేదాలున్న పూనూరి గౌతమ్‌రెడ్డిని కలుపుకొని మరీ నిర్వహించారు. దీంతో ఆ ఇద్దరు నాయకులు వారి మధ్యన ఉన్న దూరాన్ని బహిరంగంగా చాటుకుంటుండంతో పాటు పెద్దిరెడ్డి ప్రకటనకు విలువ లేకుండా చేసినట్లయింది. దీంతో కార్యకర్తలు ఎవరికి మద్దతుగా వెళ్లాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు.