రాజమండ్రి, జూలై 20,
గోదావరి నదిలో ఉవ్వెత్తున వరదనీరు పోటెత్తి ప్రహిస్తోంది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు వరద ముంపుతో అల్లాడిపోతున్నారు. వరద విలయంతో వందలాది లంక గ్రామాల వాసులు గజగజలాడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగేందుకు నీరు లేక, తలదాచుకోవడానికి చోటు లేక తల్లడిల్లిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయల పంటలు నీటమునిగాయి. వేలాది పశువులు, పెంపుడు పక్షులు, సామాగ్రి వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. తెలంగాణలోని పవిత్ర పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వెళ్లేందుకు నిర్మించిన శబరినదిపై వంతెన పైనుంచి కూడా వరదనీరు ప్రవహిస్తోంది. భద్రాచలం క్షేత్రంలో వరదనీరు ముంచెత్తేసింది. భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం అత్యంత ప్రమాదకర స్థాయిలో 71 అడుగులకు చేరుకుంది. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద గోదావరి ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దిగువన తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద పోటెత్తి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరదనీరు సుమారు 21 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 బ్యారేజీ గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి 23 లక్షల 94 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వందేళ్ల చరిత్రలో 41 పర్యాయాలు గోదావరి నదిలో భారీ వరదలు ముంచెత్తాయి. వరద పోటెత్తినప్పుడల్లా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అన్నింటినీ పోగొట్టుకుని అతలాకుతలం అయిపోతూనే ఉన్నారు. 1853 నుంచీ చూసుకుంటే.. ధవళేశ్వరం వద్ద రికార్డు స్థాయిలో అత్యధికంగా 1986 ఆగస్టు 16న 35.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించినట్లు రికార్డయింది. అంతకు ముందు 1953 ఆగస్టు 19న రెండో అత్యధిక వరదగా నమోదై 30 లక్షల క్యూసెక్కులు ప్రవహించింది. 2006 ఆగస్టు 7వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 28.5 లక్షల క్యూసెక్కుల వరద రికార్డయింది. 1990 ఆగస్టు 25న 27.8 లక్షల క్యూసెక్కుల వరదనీరు, 2010 ఆగస్టు 9న 20.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు నమోదైంది. ఇక తాజాగా గోదావరికి వచ్చిన వరద 21 నుంచి 22 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. అంటే.. గోదావరి నది చరిత్రలో 41 సార్లు వచ్చిన వరదల్లో ఈసారా నాలుగో లేదా ఐదో అతిపెద్ద వరదగా రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు.అయితే.. పదుల సార్లు గోదావరి వరదలు పోటెత్తి గ్రామాలకు గ్రామాలనే ముంచేసి, లక్షల కోట్ల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నా.. వేలు, లక్షల మూగజీవాలు మృత్యువాత పడుతున్నా ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు ఏమి చేశాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంటికి చుట్టం వచ్చిన తర్వాత పొయ్యి వెలిగించినట్టు ఏవో తాత్కాలిక చర్యలే తప్ప వరదలతో జననష్టం, ఆస్తి నష్టం జరగనివిధంగా ప్రభుత్వాలు శాశ్వతంగా చేసిన ప్రయత్నాలేవీ లేవనేది బాధితులందరి నోటా వినిపిస్తున్న విమర్శ. వరదలు ముంచెత్తుకు వచ్చిన తర్వాత నది కరకట్టలపై కొన్ని ఇసుకబస్తాలు వేయడమే తప్ప ఏటి గట్లను పటిష్టంగా ఏర్పాటు చేసే దిశగా ఏ ఒక్క ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదనేది వాస్తవం అంటున్నారు.వరదనీరు ఊళ్లను ముంచెత్తిన తర్వాత బాధిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి అరకొరగా భోజన, వసతి సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. వరదపోటు ఎక్కువైనప్పుడు ఆర్మీని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతున్నాయి తప్ప బాధితుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపెట్టకుండా ఉపేక్షిస్తున్నాయంటున్నారు. ఇప్పటికైనా వరద కష్టాల నుంచి తమను శాశ్వతంగా బయటపడేసేందుకు సరైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను బాధితులు వేడుకుంటున్నారు.