YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుంగభద్రకు వరద పోటు

తుంగభద్రకు వరద పోటు

కర్నూలు, జూలై 20,
కంటిమీద కునుకు లేకుండా గోదావరి  వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ప్రవాహం క్రమంగా తగ్గుతోందనుకుంటున్న సమయంలో మరో ముప్పు ఏర్పడింది. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర నది పోటెత్తుతోంది. ఎగువన భారీ వర్షాలు కురస్తుండటం, తుంగభద్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. క్షణ క్షణానికి ప్రవాహం అధికమవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. తుంగభద్ర డ్యామ్ కు ప్రస్తుతం 1.81లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. మంత్రాలయం వద్ద తుంగభద్ర ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో స్నానాలు చేసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. నీటిలోకి ఎవరూ దిగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాధవరం ఎత్తిపోతల పథకం విద్యుత్ ఉప కేంద్రంలోకి వరద నీరు చేరింది. ఆదివారం సాయంత్రం లోపు వరద తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుంగభద్రకు వస్తున్న భారీ వరదను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా కర్నూలులోని కేసీ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. రైతుల నుంచి డిమాండ్‌ లేకపోవడం, వర్షాలు కురస్తుండటంతో తక్కువ స్థాయిలోని నీటిని వదులుతున్నారు.మరోవైపు.. జూరాల జలాశయానికి వరద పెరుగుతోంది. జలాశయంలో 7.89 టీఎంసీల నీరు చేరడంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని దిగువకు వదులుతున్నారు. జలవిద్యుదుత్పత్తి, 23 గేట్ల ద్వారా 1.56 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు వద్ద వరదనీటి ఉద్ధృతి పెరిగిన క్రమంలో విద్యుత్తు ఉత్పత్తి తగ్గుతోంది. తుంగభద్ర జలాశయం నుంచి 30 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇది శుక్రవారానికి ఆర్డీఎస్‌ ఆనకట్టకు చేరే అవకాశం ఉంది. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం పెరిగడంతో ముందస్తు జాగ్రత్తగా సుంకేసుల జలాశయాన్ని ఖాళీ చేశారు. అందులో ఉన్న నీటిని దిగువకు వదిలేశారు. సుంకేశుల ద్వారా శ్రీశైలం ఆనకట్టకు నీటిని విడుదల చేశారు.

Related Posts