అనంతపురం, జూలై 20,
పెనుకొండ టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యతిరేకులంతా ఒక్కటి అవుతున్నారు. ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఈ పరిణామాలు తమ్ముళ్లను కలవర పెడుతున్నాయట. గతంలో పెనుకొండ పరిటాల రవి కోట. ఆ సమయంలో పార్టీ నేతల మధ్య విభేదాలు ఉండేవి కావు. జడ్పీ ఛైర్మన్, ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పార్థసారథి టైమ్‌లోనూ ఇది కొనసాగినా.. ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయన ఓడిన తర్వాత ఇక్కడ పూర్తిగా పట్టు సాధించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో టీడీపీలోని వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారధికి.. టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు పడేది కాదు. పార్థసారధికి తెలియకుండా పెనుకొండలో కిష్టప్ప కార్యక్రమాలు నిర్వహించడం నిప్పు రాజేసింది. అలాగే ఎంపీని పట్టించుకోకుండా పార్థసారథి సొంతంగా కార్యక్రమాలు చేపట్టేవారు. కిష్టప్ప సొంతూరు గోరంట్ల పెనుకొండ నియోజకవర్గంలోనే ఉంది. 2019లోనే ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ.. అధినేత వారించడంతో మళ్లీ ఎంపీగా పోటీ చేశారు. ఈ వర్గపోరు కూడా పార్థసారథి ఓటమికి కారణంగా విశ్లేషిస్తారు. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కురుబ సబిత కదలికలు పెనుకొండ పార్టీలో కాక రేపుతున్నాయి. ఆమె కూడా టికెట్ ఆశిస్తుండటమే దానికి కారణం.గతంలో పార్థసారధికి సబితకు విబేధాలు ఏమీ లేవు. సబితను ప్రోత్సహించింది కూడా పార్థసారథే. అయితే నియోజకవర్గంలో ఆయనంటే కొంత వ్యతిరేకత కనిపిస్తుండటంతో అదే సామాజికవర్గానికి చెందిన తాను ఎందుకు బరిలో దిగకూడదని సబిత లెక్కలేస్తున్నారట. ఆ మధ్య పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో సబితకు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు ఇచ్చింది. ఇద్దరూ కష్టపడి పని చేస్తే.. టికెట్ సంగతి తర్వాత చూద్దామని చెప్పారట చంద్రబాబు. అయితే పెనుకొండలో జరిగే కార్యక్రమాలను ఇద్దరూ వేర్వేరుగా చేపట్టడం వల్ల కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారట. విబేధాలను సరిదిద్దేందుకు కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు అమరావతికి పిలిపించి మాట్లాడుతున్నారు. అలాగే పెనుకొండ నేతలకు ఆహ్వానం వెళ్లింది. ఇదే టైమ్ అనుకున్నారో ఏమో.. పార్థసారధి వ్యతిరేకులంతా ఒక్కటయ్యారట.మాజీ ఎంపీ కిష్టప్ప, సబిత ఒక్కటైనట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్థసారథికి టికెట్ రాకూడదు.. మన ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేయాలి అనే ఒడంబడిక కుదిరిందట. సబితకు జిల్లాలోని మరికొందరు నేతలు మద్దతుగా నిలుస్తున్నారట. దీంతో అందరి దృష్టీ టీడీపీ సమన్వయకర్తలు నిర్వహించే మీటింగ్‌పై పడింది. అక్కడ ఎవరెవరు ఏం చెబుతారు? టికెట్‌పై క్లారిటీ వస్తుందా? ఎవరు ఎవరికి మద్దతిస్తారు? అని ఆరా తీస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. మరి.. పెనుకొండ విభేదాలకు టీడీపీ పెద్దలు ఎలా చెక్ పెడతారో చూడాలి.