న్యూఢిల్లీ, జూలై 20,
విపక్షాల ఐక్యత విచ్ఛిన్నమైపోయింది. రాష్ట్రపతి ఎన్నికలో అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావడంలో విఫలమయ్యాయి. విపక్షాలన్నీ కలిపి నిలబెట్టిన అభ్యర్థికి తామే పూర్తిస్థాయి మద్దతును అందివ్వలేకపోయాయి. అంతే కాకుండా ముందు ముందు కూడా తాము ఏకతాటిపైకి రావడం, కలిసి కమలాన్ని ఢీకొనడం సాధ్యమయ్యే పని కాదని చెప్పకనే చెప్పేశాయి.దీంతో ఎవరు ఎన్ని కబుర్లు చెపపినా విపక్షాల ఐక్యత ఎండమావి వంటిదేనని తమ చేతలతో మరోసారి రుజువు చేసేశాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి సమావేశం నిర్వహించినా.. అభ్యర్థిని ప్రకటించినా.. ఆ అభ్యర్థి తనకు మద్దతునిచ్చే పార్టీలను కలిసినా.. అవి చివరికి వచ్చే సరికి ఎవరిదారి వారిదే అన్నట్లుగా చీలిపోయాయి. ఎంతలా అంటే బిజెపి నాయకత్వంలని ఎన్డీఏ కూటమి నిలిపిన రాష్ట్రపతి అభ్యర్థికే తమ మద్దతు అంటూ విపక్షాల్లోని కొన్ని పార్టీలు బహిరంగంగా ప్రకటించేశాయి. 2024లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలలో కూడా కాషాయ పార్టీని గట్టిగా ఎదుర్కొనే విషయంలో విపక్షాలు కలిసి సాగుతాయన్న నమ్మకాన్ని ఆ పార్టీలన్నీ కలిసికట్టుగా వమ్ము చేశాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడకముందే విపక్షాల నేతలు పోటా పోటీగా బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాలు ఎవరికి వారు వేర్వేరుగా చేశారు. బిజెపిని నిలువరించాలన్న ఉద్దేశం కంటే విపక్షాల ఐక్య కూటమికి నాయకత్వం వహించాలన్న తహతహే వాటిలో అధికంగా కనిపించింది. బిజెపియేతర పార్టీలతో కూటమి, అని థర్డ్ ఫ్రంట్ అని సంకేతాలిచ్చారు. ముఖ్యమంత్రులతో డిల్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. కానీ, నిర్వహించలేదు. చివరకు బిజెపి అభ్యర్థికే మద్దతు ప్రకటించి తమ మధ్య సఖ్యతలేదంటూ పరోక్షంగా వెల్లడించారు. చివరకు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ముందు ప్రతిపక్షాలతో అధికార పక్షం ఓ మారు సంప్రదిస్తే మేము ఆలోచించే వాళ్ళం.. అని ప్రకటన చేసి తమలోని సమన్వయలోపాన్ని కనిపించకుండా జాగ్రత్త పడ్డాయివిపక్షాల తరపు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సయోధ్య కుదరలేదు. శరద్ పవార్ ను అభ్యర్థిగా పలువురు ప్రతిపాదించినా.. ఆయన పోటీకి ససేమిరా అన్నారు. దీంతో మరో అభ్యర్థి కోసం వేట సాగించారు. జూన్ నెలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు దాదాపు 17 రాజకీయ పార్టీలతో డిల్లీలో పశ్చిమ బంగాల్ సిఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, డీఎంకే, ఆర్‌జేడీ, శివసేన, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్, ఆర్‌ఎస్‌పీ, ఐయూఎంఎల్, ఆర్‌ఎల్‌డీ, జేఎంఎం పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, జైరామ్ రమేశ్, జేడీఎస్ నుంచి హెచ్‌డీ దేవెగౌడ, కుమారస్వామి, ఎన్సీపీ నుంచి శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్, ఎస్పీ నుంచి అఖిలేశ్ తదితరులు పాల్గొన్నారు. శిరోమణి అకాళీదళ్, ఆప్, టీఆర్ఎస్, టిడిపి, వైఎస్సార్‌సీపీ, బీజేడీ పార్టీలు హాజరుకాలేదు. జెఎంఎం, శివసేనలు సమావేశంలో పాల్గొని అనంతరం బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. తటస్థంగా ఉన్న పార్టీలు బిజెపి నిలిపిన అభ్యర్థికి మద్దతును ప్రకటించాయి. దీంతో బిజెపియేతర పార్టీల్లోని కొన్ని పార్టీలు బిజెపికి సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటాయనేది పరోక్షంగా సంకేతాలను వెల్లడించినట్టుగా ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ అవగాహనతో ఏర్పడిన ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తన మద్దతును బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రం విపక్షాల అభ్యర్థిగా మమతాబెనర్జీ నిలిపిన యశ్వంత్ సిన్హాకు ప్రకటించిది. మహారాష్ట్రలోనూ శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ పార్టీలు ఒక జట్టుగా ఉన్నాయి. ఇటీవలి వరకు కూడా ఈ మూడు పార్టీలు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సిఎంగా ఉండేవారు. కానీ, కాంగ్రెస్, ఎన్సీపిలు మద్దతిచ్చిన అభ్యర్థికి కాదనీ బిజెపి అభ్యర్థికి రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ప్రకటించింది శివసేన.దీంతో భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు బిజెపితో స్నేహగీతం పాడటం ఖాయమనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో విపక్షల మధ్య సఖ్యత లేదనీ, విపక్షాల్లోని కొన్ని పార్టీలు బిజెపితో కలిసి రాజకీయ ప్రయాణం సాగించే అవకాశలు లేకపోలేదనేది సర్వత్రా వ్యక్తమవుతోన్న అభిప్రాయం.