YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బలోపేతంపై దృష్టి

బలోపేతంపై దృష్టి

స్థానిక, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఇన్‌చార్జుల బలం వంటి ప్రధాన అంశాలతో పాటు బలోపేతమవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సర్వే చేపట్టింది. ఎమ్మెల్యేల పనితీరు తెలపడంతో పాటు పద్ధతి మార్చుకోవాలని సూచించడంతో పాటు, ఎమ్మెల్యేలు లేని చోట మంత్రి జగదీష్ రెడ్డి విస్తృతంగా పర్యటించేలా ఏర్పాట్లు చేశారు.

స్థానిక సంస్థలతో పాటు సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార టీఆర్‌ఎస్‌ ఓటింగును ప్రభావితం చేసే అంశాలపై దృష్టి పెట్టింది. సీఎం కేసీఆర్‌కు కుడి భుజంగా మెలిగిన మంత్రి ఆదిలో రెండేళ్లపాటు హైదరాబాద్‌కే అత్యధిక సమయం కేటాయించారు. ముఖ్యమంత్రి సమావేశాలన్నింటిలోనూ ఆయన పాలుపంచుకోవడమే గాక రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలపై వేసే మంత్రుల సబ్‌ కమిటీలన్నింట్లో ఆయనకు స్థానం కల్పిస్తూ సీఎం నిర్ణయాలు వెలువడుతున్నాయి. సీఎం కేసీఆర్‌ రెండేళ్లుగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల ప్రభావం, ఎమ్మెల్యే లేని చోట నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రభావం ఏ మేరకు ఉందన్న అంశాలపై సర్వే చేయించారు. స్థానికంగా జరుగుతున్న తప్పులు, వాటిని మెరుగుపర్చుకోవాల్సిన తీరును అధిష్ఠానం స్పష్టంగా చెప్పడమే గాక సర్వే నివేదికను ఎమ్మెల్యేల చేతికి సైతం అందించింది. సీఎం సర్వేలో మొదటి విడతలో మంత్రి జగదీష్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు అత్తెసరు మార్కులు వచ్చాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మినహా మిగిలిన వారందరికీ అంతంత మాత్రంగానే మార్కులు వచ్చాయి. దీంతో జిల్లాలో పాతుకుపోయిన కాంగ్రె్‌సను ఢీకొట్టాలంటే సంస్థాగతంగా శరవేగంగా మార్పులు జరగాలని సీఎం కేసీఆర్‌ భావించారు. ఆ నేపథ్యంలోనే మంత్రి జగదీష్‌రెడ్డి వారంలో కనీసంగా మూడు రోజుల పాటు సూర్యాపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

రెండేళ్లలో నియోజకవర్గానికి వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే కిశోర్‌ నియోజకవర్గంలో రాత్రి నిద్రతో స్థానిక నేతలందరినీ అవగాహన చేసుకుని ముందుకు పోయే కార్యక్రమాలు పెంచారు. వీటితో పాటు మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు, సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, పోచారం, తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పర్యటనలు పెంచారు. మంత్రులు నియోజకవర్గాలకు వచ్చిన క్రమంలో స్థానికంగా అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను ప్రకటింపజేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సునీతామహేందర్‌రెడ్డి స్థానికంగానే మకాం వేసి విస్తృతంగా పర్యటనలు పెట్టుకున్నారు.

రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అయితే ఎమ్మెల్యే సీటు ఖాయమనే అంశంపై సీఎం కేసీఆర్‌ పలు మార్గాల్లో సమాచారం తెప్పించుకుంటున్నారు. గెలుపు గుర్రం కాదు అని భావించిన చోట సర్వే చేయించి రెండు మూడు పేర్లను సిద్ధంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ నేపథ్యంలోనే నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాకను పక్కనబెట్టి కంచర్ల భూపాల్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. భూపాల్‌ గ్రాఫ్‌ ఎలా ఉందో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు లేని మరో రెండు నియోజకవర్గాల్లోనూ కొద్దికాలంలో మార్పులకు అవకాశమున్నట్లు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్న చోట రెండు నియోజకవర్గాల్లోనూ ఒకరిద్దరి పేర్లకు ప్రత్యామ్నాయం సిద్ధమైనట్లు తెలిసింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు ఉండడంతో స్థానికంగా అధికార పార్టీకి ఇబ్బంది లేదు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట బలోపేతంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇన్‌చార్జిపై ఆర్థిక భారం, ముఠాల పోరు వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. వీటిని అధిగమించి ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ బలోపేతానికి మంత్రి విస్తృత పర్యటనలు, ప్రత్యేక దృష్టి అవసరమని నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే మంత్రి జగదీష్‌రెడ్డి ఆరు నెలలుగా మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఎమ్మెల్యేలు లేని సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు అధిక సమయం కేటాయిస్తున్నారు. పర్యటనలు ఒక భాగమైతే నిధులు విడుదలైతేనే స్థానికంగా అభివృద్ధి పనులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందనేది బహిరంగ రహస్యం. దీంతో మంత్రి తన కోటా నుంచి పెద్ద ఎత్తున నిధులను ఎమ్మెల్యేలు లేని చోట కేటాయిస్తున్నారు.

Related Posts