కర్నూలు, జూలై 21,
ఆ ఇద్దరూ అధికారపార్టీ నేతలే. ఒకరు మంత్రి.. ఇంకొకరు సీనియర్ ఎమ్మెల్యే. మినిస్టర్‌తో విభేదిస్తున్న వారికి ఎమ్మెల్యే అండగా ఉంటున్నారట. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ను పీక్స్‌కు తీసుకెళ్తోందట. గుమ్మనూరు జయరాం. ఏపీ మంత్రి. సాయిప్రసాదరెడ్డి.. ఆదోని వైసీపీ ఎమ్మెల్యే. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన అధికారపార్టీ నేతలు. పైకి చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు కానీ.. ఇద్దరి మధ్య తెగని పంచాయితీలు చాలానే ఉన్నాయట. అందువల్లే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆ రగడ తారాస్థాయికి చేరుకున్నట్టు వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.బీసీ సామాజికవర్గానికి చెందిన జయరాం రెండుసార్లు ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. సీఎం జగన్ కేబినెట్‌లో రెండోసారి బెర్త్ పదిలం చేసుకున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆదోనిలో పట్టు సాధించారు సాయిప్రసాద్‌రెడ్డి. ఇద్దరి నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. రెండూ కర్నాటక సరిహద్దులో ఉన్న నియోజకవర్గాలే. వైసీపీలోనే కొనసాగుతున్నా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఆలూరు నియోజకవర్గంలోని జడ్పీటీసీ విరూపాక్షి.. మంత్రికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారట. అలాంటి విరూపాక్షికి సాయిప్రసాద్‌రెడ్డి ఆశీసులు ఉన్నాయట. విరూపాక్షి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆయనంటే మంత్రి జయరాం ఒంటి కాలిపై లేస్తున్న పరిస్థితి ఉంది. ఆ మధ్య సీఎం జగన్ ఆదోని పర్యటనలో విరూపాక్షికి ప్రత్యేకంగా VIP పాస్ ఇప్పించి.. ముఖ్యమంత్రిని కలిపించడంలో సాయి ప్రసాదరెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర ఉందని జయరాం వర్గం రుసరుసలాడుతోందట.ఒకప్పుడు జయరాం, సాయి ప్రసాదరెడ్డిలు ఇద్దరూ బాగానే ఉండేవారు. మధ్యలోనే విభేదాలు వచ్చి… అవి ముదురు పాకాన పడినట్టు టాక్. ఆదోని సీఎం పర్యటనలో మంత్రి జయరాం అనుచరుడు లక్ష్మీ నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్‌ల కోసం లక్ష్మీనారాయణ పరుగెత్తుతుంటే అనుమానం వచ్చి ఆపారు పోలీసులు. ఆ సమయంలో మంత్రి ఫోన్ చేసి చెప్పినా పోలీసులు లక్ష్మీనారాయణను విడిచిపెట్టలేదట. దాని వెనక సాయిప్రసాద్‌రెడ్డి పాత్ర ఉందని జయరాం అండ్ కో అనుమానిస్తోంది. చివరకు మంత్రే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అనుచరుడిని విడిపించుకుని వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన ఇద్దరి మధ్య మరింత గ్యాప్ తీసుకొచ్చినట్టు చెబుతున్నారు.ఆ మధ్య ఆదోని మండలం జాలవాడిలో వాల్మీకి విగ్రహాన్ని మంత్రి జయరాం ఆవిష్కరిస్తే.. ఆ కార్యక్రమానికి సాయి ప్రసాదరెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో ఇద్దరికీ ఎక్కడ చెడింది అనేది పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ సందర్భంగా చర్చల్లో ఉన్న అంశాలే ఆసక్తిగా మారుతున్నాయి. సాయి ప్రసాద్‌రెడ్డి సోదరుడు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డితోనూ మంత్రికి పడటం లేదట. చిప్పగిరికి చెందిన జయరాం అనుచరులు గుంతకల్లులో ఓవర్ చేస్తున్నారట. అలాగే ఆలూరులో ఎమ్మెల్యే సాయి ప్రసాదరెడ్డి అనుచరులకు భూమి ఉందట. ఆ భూమిని మంత్రికి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని సమాచారం. ఆ విషయంలో నేతలిద్దరి మధ్య ఫోన్‌లో గట్టిగానే వాగ్వాదం జరిగిందట. ఈ గొడవల వల్లే అధికారపార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్టు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఇక్కడితో ఆగుతారో లేక.. ఎన్నికల సమయంలో రాజకీయాన్ని ఇంకా రసకందాయంలో పడేస్తారో చూడాలి.