YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాన పడితే అంతే సంగతులు

వాన పడితే అంతే సంగతులు

 వన కురిస్తే అందరూ సంతోషిస్తారు.. జిల్లాలోని పట్టణాల్లో ఆ పరిస్థితి లేదు. మురుగు కాలువలు ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించకపోవడం.. ఆక్రమణలతో కుంచించుకుపోయిన కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో వర్షపు జల్లు కురిస్తే నీరు కదలక వీధులన్నీ మునిగిపోతున్నాయి. ప్రధాన రహదారులు సైతం జలమయం అవుతున్నాయి. వేసవిలో వీటిని ప్రక్షాళించాల్సిన పాలకులు తాత్సారం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఏలూరు నగరంతోపాటు పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పట్టణాలున్నాయి. అన్నిచోట్ల డ్రెయినేజీ సమస్య వెంటాడుతోంది. చిన్నపాటి చినుకు పడితే చాలు.. జిల్లాలోని పట్టణాల్లో పల్లపు ప్రాంతాలు ముంపుబారిన పడి జలాశయాలుగా మారుతున్నాయి.

అన్నిచోట్ల సరైన మురుగు కాలువల నిర్మాణం లేకపోవడం, రోజువారీ చెత్తాచెదారం, మురుగు తొలగింపు పనులు చేపట్టకపోవడంతో ప్రధాన మురుగు కాలువలతోపాటు చిన్నపాటి కచ్ఛా కాలువలు కూడా పూడుకు దశకు చేరాయి. ఏటా వర్షాకాలం ముందు వేసవిలో డ్రెయిన్లలో మట్టి తొలగింపు పనులు చేస్తున్నా ఫలితాలు అంతంతమాత్రమే. సకాలంలో పనులు చేపట్టకపోవడం, చేసిన కొద్దిపాటి పనులు సరిగా జరగకపోవడంతో ఉపయోగం లేకుండా పోతోంది.

పట్టణ ప్రాంతాల్లో డ్రెయిన్లలో మట్టి తొలగింపు పనులకు ముందస్తు చర్యలే మేలనేది ప్రజల అభిప్రాయం. ముంపు జరిగినప్పుడు హడావుడి చేసి ప్రత్యామ్నాయ చర్యలకు పరుగులెట్టే కన్నా ఎదురయ్యే సమస్యను అధిగమించేలా ముందుగా కదిలితే కొంత ఫలితాలు ఉంటాయి. పూడిపోయిన ప్రధాన మురుగు కాలువలతోపాటు చిన్న కాలువల్లోని మట్టి తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. ఏటా ఆయా పురపాలక సంఘాలు అక్కడి పరిస్థితులను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు పెడుతున్నాయి. అంటే సరాసరి రూ.కోటిపైనే అవుతుంది. ప్రణాళికలు గొప్పగా ఉన్నా.. వర్షాకాలం వచ్చేవరకు పనులు చేయడం లేదు. ఆ తర్వాత చేపడదామన్నా వానలతో ఆటంకం కలుగుతోంది. వేసవిలో మట్టిపనులు చేపడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. డ్రెయినులో నుంచి వచ్చిన బురద మట్టి ఎండి ఇతర చోట్లకు తరలించే అవకాశం ఉంటుంది. వర్షం పడితే పనులకు ఆటంకంతోపాటు తీసిన లూజు మట్టి తిరిగి కాలువలోకి జారిపోతుంది. తరలించే పరిస్థితలేక అక్కడే నిల్వ ఉండి దుర్వాసన వస్తుంది. నీరు సకాలంలో వేగంగా వెళ్లే మార్గం ఉండదు. దీన్ని అధిగమించేలా ఇప్పటికే అన్ని పురపాలక సంఘాలు ప్రస్తుత వేసవిలో పనులు చేపట్టేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. కొన్ని పురపాలక సంఘాల్లో పనులు మొక్కుబడిగా మొదలుకాగా మరికొన్నిచోట్ల కదలిక లేదు.

గత ఏడాది పాలకొల్లు పురపాలక సంఘంలో రూ.8 లక్షలతో డ్రెయిన్లలో మట్టి తొలగింపు పనులు చేసేందుకు వర్షాకాలం వచ్చిన తర్వాత టెండర్లు పిలిచారు. దీంతో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ ఏడాది పొక్లెయిన్‌తో చేపట్టే పనులకు రూ.2 లక్షలు, కార్మికులతో చేపట్టే పనికి రూ.2 లక్షలు చొప్పున కేటాయించారు. ఇవి ప్రస్తుతం టెండర్ల దశలోనే నలుగుతున్నాయి. మరోపక్క చిన్నపాటి డ్రెయిన్లలో మట్టి తొలగింపు పనులను ఇటీవల చేశారు. ఇతర పురపాలక సంఘాల్లో ఇటువంటి తీరే కనిపిస్తోంది.

పాలకొల్లులో ప్రధాన డ్రెయినేజీలకు ఔట్‌లెట్ల సమస్య పీడిస్తోంది. మొత్తంగా 162.62 కిలోమీటర్లు మేర డ్రెయిన్లు ఉండగా నీరు సకాలంలో బయటకు లాగే మార్గంలేక బ్రాడీపేట, కోడిగట్టు, పల్లపువీధి, కొత్తపేట, హౌసింగ్‌బోర్డుకాలనీ, దేశాలమ్మ ఆలయ ప్రాంతం, బంగారువారి చెరువుగట్టు ప్రాంతం, అల్లు వెంకటసత్యనారాయణ కాలనీ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఏలూరులో 332 కిలోమీటర్లు మేర డ్రెయిన్లు ఉండగా 108 కిలోమీటర్లు మేర ప్రధాన డ్రెయిన్లు, 124 కిలోమీటర్లు పక్కా డ్రెయిన్లున్నాయి. అయినా వర్షాకాలంలో శివారు ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. భీమవరంలో వర్షాకాలం వస్తే గునుపూడి, హౌసింగ్‌బోర్డుకాలనీ, మెంటేవారితోట, చిన్నరంగనిపాలెం, బ్యాంకుకాలనీ, ఇందిరమ్మకాలనీ, ప్రకాష్‌నగర్‌ తదితర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. తణుకులో ఇరగవరం కాలనీ, బ్యాంకుకాలనీ, ఎన్జీఓకాలనీ తదితర ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ రూ.70 లక్షలతో డ్రెయినేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు నాలుగేళ్ల క్రితం పంపిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. 

నరసాపురంలో ప్రధాన రహదారుల్లోనే వర్షం నీరు నిలిచి ఉంటుంది. 27 కిలోమీటర్లు పొడవునా డ్రెయిన్లు ఉండగా భూగర్భ డ్రెయిన్ల నిర్మాణానికి గతంలో రూ.58 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు. వైఎస్‌ఆర్‌కాలనీ, రుస్తుంబాదా, మాధవాయపాలెం, నందమూరికాలనీ తదితర ప్రాంతాలు నీట మునుగుతాయి. తాడేపల్లిగూడెంలో మసీదు కూడలి, స్టేషన్‌రోడ్డు, యాగర్లపల్లి, రెల్లికాలనీ, కడగట్ల తదితర ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. నిదడవోలులో వర్షం కురిస్తే ప్రధాన రహదారులు కూడా చెరువుల్లా తయారవుతున్నాయి. కొవ్వూరులో రాజీవ్‌నగర్‌, క్రిస్టియన్‌పేట, శ్రీనివాసపురం తదితర ప్రాంతాలదీ ఇదే పరిస్థితి.

Related Posts