ఒంగోలు, జూలై 21,
ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీలో లుకలుకలు, ఒకటొకటిగా బయట పడుతున్నాయి. వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాటలో తిరుగుబాటు జెండా ఎగరేసే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు వచ్చి చేరిందని అంటున్నారు. నిజానికి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చాలా కాలంగా, ప్రభుత్వ పనితీరును, ఎక్కడి కక్కడ ఎండగడుతూనే ఉన్నారు. అయితే, రఘురామ కృష్ణం రాజులా నేరుగా కాకుండా, ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా, అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు అధికారుల మీద ఫైర్ అవుతున్నారు. అయితే, తాజాగా ముసుగును కాస్త పక్కకు తీసి, తన అసహనాన్ని, ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి మీదకు ఎక్కు పెట్టారని అంటున్నారు. అయన, అధికారులు మంచివారేనని, కానీ ఎక్కడో తేడా ఉందంటూ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయ. రాష్ట్రంలో ఒక్క పని కూడా ముందుకు సాగడంలేదని, అభివృద్ధి ఎక్కడా లేదని, మాగుంట పరోక్షంగా ముఖ్యమంత్రి, మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాండ్ నిధులకు లెక్కలు లేవని, ఏమి చేశారని నిలదీశారు. ఇలా అయితే ప్రజల్లో ప్రభుత్వ పరువు పోతుందని, కొంచే ఘాటుగా సొంత పార్టీ ప్రభుత్వం పైనే విమర్శలు గుప్పించారు. నిజానికి, గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట మొదటి నుంచీ పార్టీలో ఇమడలేకపోతున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. వైసీపీలోని ఇతర నేతలతో మొదటి నుంచి ఆయనకు సఖ్యత లేదంటూ వార్తలు వచ్చాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా అయన దూరంగానే ఉంటున్నారు. మరో వంక వ్యాపార వ్యవహారాలను చక్క పెట్టుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో, తెలుగు దేశం సహా అన్నిపార్టీల నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నారని వైసీపీ నేతలు పలు సందర్భాలలో ఆరోపించారు. నిజానికి ఇటు అధికారుల నుంచి, అటు పార్టీ వర్గాల నుంచి కూడా మాగుంటఫై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నా, ఆయన పెద్దగా పట్టించుకోలేదని పార్టీ నాయకులు, అధికారులు అంటున్నారు. అయితే, మాగుంట చేసిన తాజా వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇక ఉపేక్షించి లాభం లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే, పార్టీ నాయకులు, అధికారులతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి, చెప్ప వలసినంత వరకు చెప్పాం, అయినా ఆయన మారడం లేదు, ఇక ఆయన్ని వదిలేయండి, అని చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశం వచ్చిన నేపధ్యంలో, అధికారులు ఎంపీని అసలుకే పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను చర్చించేందుకు, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి నగరపాలక సంస్థ అధికారులుకానీ, సిబ్బందికానీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు చేస్తే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఒకరిని పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో, ఎంపీ మాగుంట వైసీపీలో ఉన్నారా ? లేరా ? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అదలా ఉంటే వైసీపీ నేతలు ఎవరూ ఆయన్ని కలవొద్దని, ఒకవేళ ఆయన కటువైన వ్యాఖ్యలు చేసినా వైసీపీ శ్రేణులెవరూ స్పందించవద్దని అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో మాగుంట వైసీపీ తరఫున పోటీచేసే అవకాశాలు లేనట్లేనని, ఆయన తిరిగి తెలుగుదేశం గూటికే చేరుకుంటారంటూ ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. అదలా ఉంటే ఎంపీలు , మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఒకరొకరు పార్టీకి దూరం అవుతున్న నేపధ్యంలో, వైసీపీ నిట్టనిలువునా చీలే రోజు ఎంతో దూరంలో లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.