శ్రీకాకుళం, జూలై 21,
టీడీపీలో ఇటీవల ఓ ట్రెండ్ మొదలైంది. సంచలన విషయాలను త్వరలోనే బయటపెడతామని చెబుతారు నాయకులు. ఆ తర్వాత అంతా గప్‌చుప్. ఉలుకు ఉండదు.. పలుకు ఉండదు. ఆ స్టేట్‌మెంట్స్ ఎందుకిస్తారో.. ఏంటో వాళ్లకే తెలియాలన్నది తమ్ముళ్ల మాట. ఏదైనా ఓ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్నో.. ప్రభుత్వంలోని పెద్దలనో టార్గెట్ చేసే క్రమంలో విపక్షాలు కొన్ని వ్యాఖ్యలు చేయడం సాధారణం. కానీ.. ఈ విషయంలో ఓ అడుగు ముందుకేస్తున్నారు టీడీపీ నేతలు. ఏపీ ప్రభుత్వ అవినీతికి సంబంధించి కొన్ని ఆధారాలు లేదా సంచలన విషయాలు బయట పెడతామని ఆసక్తి రేకెత్తిస్తున్నారు. దాంతో ఆ టీడీపీ నేతలు ఏం చెబుతారో అని చర్చ జరుగుతోంది. రోజులు గడుస్తాయి కానీ.. ఆ మాటలు చెప్పిన వాళ్లు మళ్లీ నోరు తెరవరు. వారు బయట పెట్టే ఆధారాలేంటో తెలియదు.. బయటకు రావు. టీడీపీలో ఏదో చిన్నా చితకా నాయకుడు కామెంట్ చేస్తే పెద్దగా పట్టించుకోరు. అసలు చర్చల్లోకి రాదు. కానీ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వంటి వాళ్లే ఆ తరహా స్టేట్‌మెంట్స్ ఇస్తుండటంతో అధికార, విపక్షాల్లో అటెన్షన్ వస్తోంది. ఆ మధ్య మహానాడు వేదికగా ఓ ప్రకటన చేశారు లోకేష్. ఏపీ ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని బయట పెడతామని వెల్లడించారు. ఆ సమయంలో ఆ కామెంట్ సంచలనమే అయ్యింది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తారని టీడీపీ వర్గాలు భావించాయి. వైసీపీ ప్లీనరీ ఉండటంతో.. దానిపై ప్రభావం పడేలా ప్లీనరీకి కొంచెం అటో ఇటో లోకేష్ పెదవి విప్పుతారని భావించారు. కానీ.. టీడీపీ శిబిరం నుంచి ఎలాంటి ఊసూ లేదు. వైసీపీ ప్లీనరీ కూడా అయిపోయింది. ఆ కుంభకోణం ఏంటో లోకేష్ చెప్పింది లేదు. ఇదే తరహాలో పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా తాజాగా ఓ ప్రకటన చేశారు. తన సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని.. దానికి సంబంధించి సంచలన విషయాలు బయట పెడతానని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆయన ఏం చెబుతారో అని అంతా అనుకున్నారు. ఆ ఎపిసోడ్ జరిగి రోజులు గడుస్తున్నా పయ్యావుల నోరు విప్పింది లేదు. కాకపోతే కామెంట్ చేసింది పయ్యావుల కావడంతో కాస్త ఆలస్యమైనా ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నాయి.ఈ రెండు ఉదంతాలు చూశాక.. టీడీపీ నేతలకు ఏమైంది? ఎందుకీ ప్రకటనలు చేస్తున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అలాంటి ఆధారాలే ఉంటే.. రాజకీయంగా కలిసి వస్తుంది అని భావిస్తే.. ఎందుకు ఆలస్యం చేస్తారన్నది విశ్లేషకుల మాట. కీలక నేతల నుంచి వస్తున్న ప్రకటనలకే ప్రాధాన్యం లేకపోతే ఎలా అన్నది తమ్ముళ్ల మాట. ఇది వ్యూహమో .. కాదో కూడా కేడర్‌కు అర్థం కావడం లేదట. వాస్తవాలెలా ఉన్నా.. ప్రకటనలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడపలు దాటడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. రానున్న రోజుల్లోనూ నేతల తీరు ఇలాగే ఉంటే మొదటికే మోసం వస్తుందని.. ఒకవేళ సీరియస్ అంశాన్ని ప్రస్తావించినా.. పెద్దగా రాజకీయ ప్రయోజనం కలగబోదనే వాదన ఉంది. ఇది టీడీపీ నేతలకు తెలియంది కాదు. కానీ.. ఎందుకలా చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న.