కులోన్మాదమనే అగ్నికి రాజకీయాల గాలి తోడు కావడంతో పద్మావత్ చిత్రం వివాదాస్పదంగా మారింది. చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, జమ్మూ కశ్మీర్, గోవాల్లో బుధవారం నిరసనలు, ఆందోళనలు, హింసాకాండ చెలరేగాయి. సుప్రీంకోర్టు ఆదేశాలనూ ఉల్లంఘిస్తూ కర్ణిసేన వంటి కులసంస్థలు అహ్మదాబాద్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు, షాపింగ్ మాల్స్, బస్సులు, మోటారు సైకిళ్లు తదితర ఆస్తుల విధ్వంసకాండకు పాల్పడ్డాయి. గురుగావ్‌లో స్కూలు బస్సుపై ఆందోళనకారు లు దాడిచేసి అందులోని బాలలను భయభ్రాంతులకు గురిచేయడం ఉన్మాదా నికి పరాకాష్ఠ. రాజస్థాన్ ఢిల్లీ జైపూర్ హైవే, ఇతర రహదారులు, ఉత్తరప్రదేశ్ మార్కెట్లు మూతపడ్డాయి. పద్మావత్ చిత్రం విడుదలపై రాజపుట్ కులస్థులు ఇలా విరుచుకుపడడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశృంఖల విధ్వంసానికి పాల్పడుతున్నా అడ్డుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలే కర్ణిసేనతో స మానంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేశాయి. పద్మా వత్‌ను అడ్డుకోవడం ద్వారా రాజ్యాంగంలో పొందు పరచిన పౌరుల భావ ప్ర కటనా స్వేచ్ఛకు కొన్ని మత/కులతత్వ సంస్థలు విఘాతం కలిగించడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కుల, మత, ప్రాంత తదితర కొన్ని అస్తి త్వ సమూహాలు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ విధ్వంసానికి పా ల్పడుతుంటే ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చేష్టలుడిగి చూస్తుండడం దారుణం. రాజపుట్ కులస్తుల ఓటుబ్యాంకు కోసం పద్మావత్ చిత్రం వివాదం మిలిటెంట్ రూపం తీసుకుందన్న విమర్శకుల వాదనలను తప్పు పట్టనవసరం లేదు. చిత్రాలు ఎంత సంచలనాత్మకంగా మారుతాయో అంత ఎక్కువ మొత్తంలో మొదటి రోజుల కలెక్షన్లు వస్తాయనే దర్శక, నిర్మాతల క్షుద్ర మార్కెటింగ్ వ్యూహాలను అర్థంచేసుకొని ఉద్వేగాలకు లోనుకాకూడదు.
ఇతివృత్తాన్ని సమాజంలోని కొన్ని సమూహాలను రెచ్చగొట్టే విధంగా రూపొందించి లబ్ధిపొందాలనుకోవడం దుర్మార్గం. రాజపుట్ కులస్తులకు రాణీ పద్మావతి ఆరాధ్యమూర్తి అని, ఆమెను తమ కులస్త్రీల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తున్నపుడు, వారి ఆచారాలకు, మనోభావాలకు విరుద్ధంగా పాటలుగానీ, సన్నివేశాలుగానీ చిత్రీకరించడం ఎలాంటి సామాజిక దుష్పరిణామాలకు దారితీస్తాయో తెలియని స్థితిలో దర్శక నిర్మాతలున్నారనుకోలేం. అయితే తమకు నచ్చని సాహిత్య, సాంస్కృతిక సృజనలతో విభేదించడంలో తప్పులేదు. అదివారి హక్కు. అయితే హక్కుపేరుతో రాజ్యాంగం కల్పించిన ఇతర హక్కులను అడ్డుకోవడం, హింసాత్మక దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రజాస్వామిక వాదుల ప్రశ్న. ఈ ఏడాదిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో అధికార పార్టీల ప్రోత్సాహం కూడా ఇలాంటి ఉ ద్వేగ ఉద్యమాలకు లభిస్తోందన్న విమర్శల్లోనూ హేతువిరుద్ధత కనపడటం లేదు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, వివరాలపై కాకుండా వ్యక్తిగత విశ్వాసా లు, అహేతుక అస్తిత్వ భావోద్వేగాలపై ప్రజాభిప్రాయం రూపొందుతున్న సత్యానంతర (పోస్ట్ ట్రూత్) కాలంలో రాజ్యాంగ పరిధుల్లో నిరసనలు వ్యక్త మవుతాయనుకోవడం అత్యాశే అవుతుంది. మతతత్వ రాజకీయాలు ఉన్నం త కాలం కుల, మత విద్వేష కాండలు, శకల మతవాదంగా కొనసాగే అస్తిత్వ భావోద్వేగ ఉద్యమాలు ఆధిపత్య శక్తుల అధికార సుస్థిరత కోసం సమాజాన్ని అతలాకుతలం చేస్తూనే ఉంటాయి.