విజయవాడ, జూలై 22,
జగన్ సారథ్యంలోని వైసీపీలో అసమ్మతి పెరిగిపోతోంది. పార్టీ కోసం, పార్టీ ప్ర్తిష్ట కోసం ప్రాణం పెట్టయినా పని చేస్తామనే వారి సంఖ్య తగ్గిపోతోంది. పార్టీ నాయకుడికే షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మామూలుగా ఎక్కడయినా అధికార పక్షానికి విపక్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది, సమస్యలూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ వైసీపీలో వ్యవహారం రివర్స్ లో ఉంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారు, పార్టీపై వ్యతిరేక కామెంట్లు చేసేవారు ఎక్కువవుతున్నారు. ఇంటి గుట్టు ఇంటి వారే బయట పడేసుకుంటున్నారు. పార్టీలో రెబెల్ వ్యవహారాలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. పార్టీపై. అధినేత జగన్ పై ఎంపీ రఘురామ రాజు మొదటి తిరుగు బావుటా ఎగుర వేశారు. ఎంపీ రఘురామరాజు బాటలోనే కొందరు వైసీసీ సీనియర్ నాయకులు అడుగులు వెస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ప్రస్తుతం రఘురామరాజు వైసీపీలో ‘రెబెల్ స్టార్’గా అందరి గుర్తింపు పొందారు. గత రెండున్నర సంవత్సరాలుగా పార్టీకి ఆయనకూ మధ్యలో ఏది పడినా అది భగ్గుమంటోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారు. నాయకుని పాలనా తీరు పట్ల అంతర్గతంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ క్యాబినెట్ పునర్వవస్థీకరణ అనంతరం మంత్రిపదవులు కోల్పోయిన వారు, ఆశించి భంగపడిన వారు చాలామంది బహిరంగంగానే విమర్శించారు. అనేకమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూపులు సారించారు. తాజాగా వైసీపీ నాయకులు కొందరు హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో దీన్ని గురించి తర్జనభర్జన జరుగుతోంది. వాస్తవానికి ఎవరికి వారు కళ్లు మూసుకున్న పిల్లిలానే వ్యవహరిస్తున్నారు. వైసీపీలో ఏమి జరుగుతోందన్నది అందరికీ ఆలోచించే, మాట్లాడుకునే కథగా మారింది. తన నియోజకవర్గం అభివృద్దికి ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి అందలేదన్న బాధతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకంగా మురికి కాలవలోకి వెళ్లి నిలబడి నిరసన వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఇంతకన్నా తీవ్రంగా పార్టీ పట్ల, ముఖ్యమంత్రి పట్ల నిరసనను ఎవరూ వ్యక్తం చేయలేరు. ఆయన ప్రభుత్వ తీరు తెన్నులపై ఘాటుగానే విమర్శించారు. రాచమల్లు శివప్రసాద రెడ్డి సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఆయన చాలా కాలం నుంచే జగన్ పట్ల విముఖతతో వున్నారు. పైగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని, పార్టీ అధినేతను పొగుడుతూ రోజూ స్వపార్టీ పట్ల నిరసనను తెలియజేస్తున్నారు. అలాగే దర్శి ఎమ్మెల్యే విసుర్లు మరీ హాట్ గా ఉన్నాయి. మద్ది శెట్టి వేణుగోపాల్ విమర్శలతో పార్టీ పరువు గంగలో కలుస్తోంది. వీరే కాదు, ప్రభుత్వ పని తీరుపట్ల విసిగెత్తిన వారి సంఖ్య వైసీపీలో రోజు రోజుకూ సంఖ్య పెరుగుతోంది.చాలాకాలం మౌనం వహించి మూడేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ఆ ఆవేదనను, నిరాసక్తతను ఒక్కొ క్కరూ బయటికి వెళ్లగక్కుతున్నారు. ఏ నియోజకవర్గానికి అభివృద్దికి నిధులు ఇవ్వకపోతే ఎవరు మాత్రం సీఎం ఆదేశా లను శిరసావహిస్తారు. జగన్ తీరు వల్ల ఇటు నియోజకవర్గంలో ప్రజల వద్ద ప్రతిష్ట మసకబారి, నిధుల గురించి అడిగితే జగన్ ఆగ్ర్హహానికి గురై రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది మా పరిస్థితి అని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో వాపోతున్నారు. జగన్ తీరు పట్ల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరైతే.. అసంతృప్తిని లోలోనే ఉంచుకుని సమయం కోసం చూస్తున్న వారు మరెందరో ఉన్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.