హైదరాబాద్, జూలై 25,
ఒక వైపు కరోనా వ్యాప్తి నాలుగో వేవ్ దిశగా సాగుతోంది. మరో వైపు మరో కొత్త వైరస్ మంకీ పాక్స్ ఆందోళన కలిగిస్తోంది. రెండు వైరస్ లకూ ఒకే ప్రొటో కాల్ పాటింకాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలనీ, తప్పని సరిగా మాస్క్ ధరించాలని చెబుతోంది. అయితే ఆ జాగ్రత్తలు పాటిస్తున్న దాఖలాలు దేశంలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో దేశంలో మంకీ పాక్స్ వ్యాప్తి కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. ఎటువంటి విదేశీయానం చేయని ఢిల్లీ వ్యక్తికి మంకీ పాక్స్ పాజిటివ్ రావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఢిల్లీలో ఇదే తొలి మంకీ పాక్స్ కేసు కావడం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఇటీవల ఒక పార్టీకి హాజరయిన 34 ఏళ్ల వ్యక్తి మూడు రోజుల క్రితం జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆస్పత్రిలో చేరారు. ఆ వ్యక్తి శాంపిల్‌ను డాక్టర్లు పుణఎలోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవి)కి పంపగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంకీపాక్స్ వ్యాప్తి నియంత్రణకు కొవిడ్ కు పాటించే ప్రొటోకాల్‌నే పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్‌ఓ) మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ లో మంకీ పాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆదివారం న్యూఢిల్లిలో మంకీపాక్స్ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు ఐసీఎంఆర్ ఉన్నతాధికారుల హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రొటోకాల్ పాటించాలని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ మంకీ పాక్స్ డేంజర్ బెల్స్ మోగాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలతో బాధపడతున్నాడు. అతడికి హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామనీ, శాంపిల్స్ సేకరించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపామనీ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.అయితే మంకీపాక్స్ గురించి ఆందోళన అవసరం లేదన్నారు. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయనీ, ఈ వ్యక్తి జులై 6న కువైట్ నుంచి వచ్చాడనీ, 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి రాషెస్ రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లినట్టు డీహెచ్ తెలిపారు. దీంతో అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు గుర్తించి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారని, అక్కడ్నుంచి 108లో అతన్ని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించామన్నారు. నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించామనీ, వారెవరికీ మంకీపాక్స్ లక్షణాలు లేవనీ చెప్పారు.