తిరుపతి, జూలై 25,
అతివృష్టి – లేకుంటే అనావృష్టిలా మారింది టమాటా ధరల పరిస్థితి. నెల రోజల వరకు సెంచరీకి దగ్గరలో ఉన్న ధరలు.. ప్రస్తుతం భారీగా పడిపోయాయి. కిలో రూ.5 కు చేరి నేలచూపులు చూస్తోంది. టమాటా పంటకు ఆసియాలోనే పెద్ద మార్కెట్‌గా పేరు పొందిన మదనపల్లె లోని ధరలు దారుణంగా పడిపోయాయి. నాలుగు రోజులుగా మార్కెట్ లో ధరలు తగ్గిపోవడంతో అన్నదాతలు బావూరుమంటున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన సరకును ఇంటికి తీసుకెళ్లలేక ఎంతో కొంతకు కొనాలని ప్రాథేయపడుతున్నారు. మార్కెట్ కు వచ్చిన సరకులో 70శాతం మాత్రమే అమ్ముడయ్యాయంటే ధరల పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా రెండు,మూడు రోజుల క్రితం కిలో టమాటా రూ.10 నుంచి రూ.12 వరకు పలికింది. అయితే నిన్న నాటికి కేజీ టమాటా ధర రూ.5 కు పడిపోవడం గమనార్హం. ఇందులో కమీషన్, రవాణా ఖర్చులు, కూలలకు వేతనం పోగా రైతుకు రూపాయి కూడా మిగలడం లేదు. అంతేకాకుండా రైతులే ఎదురు చెల్లించాల్సిన పరిస్థితి కొన్ని చోట్ల నెలకొంది.ఫస్ట్ క్లాస్ 30 కిలోల క్రేట్ టమాటా.. అత్యధికంగా రూ.150 పలికింది. రెండో రకం రూ.70కు అమ్ముడయింది. మదనపల్లె మార్కెట్‌కు రాయలసీమతో పాటు కర్ణాటక నుంచి కూడా సరకు వస్తోంది. ఇక్కడి నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు టమాటా ఎగుమతి చేస్తుంటారు. అయితే టామాటా ఎగుమతి అయ్యే రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వచ్చాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో మార్కెట్‌కు తీసుకొచ్చిన టమాటాలను కొనే పరిస్థితి లేకుండా పోయిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.