కర్ణాటకలో బిజెపికి అనుకూలంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, గతంలో 40 స్థానాలున్న బిజెపికి కర్ణాటకలో తాజా ఎన్నికల్లో 104 స్థానాలు వచ్చాయని, అక్కడి ప్రజలు సిద్ధిరామయ్య ప్రభుత్వాన్ని కసితో ఓడించారని, నిజంగా హాట్సప్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు. ఆత్మప్రబోధానుసారం ఎమ్మెల్యేలు ఓటు వేసి ఉంటే... బిజెపి ప్రభుత్వం కొలువుదీరేదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.హైదరాబాద్‌లో నిర్వహించిన బిజెపి నగర కార్యవర్గ సమావేశంలో డాక్టర్ లక్ష్మన్ మాట్లాడుతూ....మోదీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రజలు బిజెపికి పట్టం కడుతున్నారన్నారు. దేశంలో పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంటు వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి విజయబావుటా ఎగురవేస్తూ వస్తుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. పేదల అభ్యున్నతి కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం మోదీ అనుసరిస్తున్న విధానాలు అందరికి ఆమోద యోగ్యంగా ఉన్నాయన్నారు.అవినీతి కాంగ్రెస్ ను ఓడించి బిజెపికి అనుకూలంగా ప్రజలు ఓటు వేసినప్పటికీ.. కాంగ్రెస్, జేడీఎస్ లు సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పెట్టి క్యాంపు రాజకీయాలు జరిపారని, టీఆర్ఎస్ కీలక నాయకులు లోపాయకారిగా కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకుని కర్ణాటక రాజకీయాలను శాసించే దుస్థితి వచ్చిందన్నారు. స్వయంగా ఓ టీఆర్ఎస్ నాయకుడికి చెందిన ట్రావెల్ సంస్థ బస్సుల్లోనే కర్ణాటక ఎమ్మెల్యేలను తరలించడం నిజంగా సిగ్గుచేటని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు మైండ్‌గేమ్ రాజకీయాలను చేయడం దురదృష్టకరమని డాక్టర్ లక్ష్మన్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే జేడీఎస్ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరవుతామని సీఎం కేసీఆర్ చెప్పడం చూస్తే.. కర్ణాటకలో బిజెపి వస్తే.. తెలంగాణలోనూ బిజెపి బలోపేతం అవుతుందన్న భయం పట్టుకుందని అర్ధం అవుతుందన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని గవర్నర్ పిలిస్తే ప్రజాస్వామ్యం గెలిచిందని కేసీఆర్ అనడం చూస్తే.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జేడీఎస్ పార్టీగా మారబోతున్నదని డాక్టర్ లక్ష్మన్ వ్యాఖ్యానించారు.ప్రజలిచ్చిన తీర్పుకు అనుకూలంగా బిజెపి అధికారంలోకి రాకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుటిల రాజకీయాలు చేయడం దారుణమన్నారు. దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడానికి తెలుగు ముఖ్యమంత్రులు పడుతున్నతాపత్రయం చూస్తే అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తారని అర్ధం అవుతుందన్నారు.హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు అత్యధిక అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవడమే బిజెపి శ్రేణుల ముందున్న లక్ష్యమని, గత ఎన్నికలకు ముందు నగర ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. రెండు పడక గదుల ఇళ్లు, విశ్వనగరం వంటి హామీలు పూర్తిగా గాలికొదిలేశారని, చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.రాష్ట్రంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని టీఆర్ ఎస్ ప్రభుత్వం... ప్రజా శ్రేయస్సును విస్మరించిందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. మూసీ ప్రక్షాళన, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, విశ్వనగరం హామీల గురించి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలని డాక్టర్ లక్ష్మన్ డిమాండ్ చేశారు.కర్ణాటక ఎన్నికల అనంతర పరిణామాలను చూస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కూటమిగా ఏర్పడే ప్రమాదం ఉందని, ప్రజలంతా ఒక పక్షం .. అవకాశ వాద పార్టీలు ఒకపక్షం అన్నట్లు పరిస్థితి తయారయిందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. ప్రజలందరూ మోదీ ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో బిజెపిని ఆదరిస్తుంటే.. కాంగ్రెస్, టీఆర్ ఎస్ లు కూటమిల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎంఐఎం ను పెంచి పోషించే పార్టీలు టీఆర్ ఎస్, కాంగ్రెస్‌లని, హైదరాబాద్‌ను రక్షించాలంటే బిజెపిని గెలిపించాల్సిన అవసరం ఎంతో ఉందని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. అవినీతి కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ ఆపన్నహస్తం ఇస్తున్నట్లుగా పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని, అధికారం కోసం విపరీత రాజకీయాలు చేయడం అంత మంచిది కాదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. గతంలో విబేధాలున్న పార్టీలతో తాజాగా జట్టు కట్టి బిజెపికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని, అధికారం కోసం అంటిముట్టని పార్టీలు కూడా ఏకం అవడం, మళ్లీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చూస్తూ.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉందని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.
ఇంటింటికి బిజెపి విస్తరిస్తుందని, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు బిజెపికి అండగా కలిసి వస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వచ్రే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి విజయం ఖాయమని డాక్టర్ లక్ష్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.