YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కన్నీటి వరదలు...

కన్నీటి వరదలు...

ఏలూరు, కాకినాడ, జూలై 26,
అడుగు తీసి అడుగువేయలేనంత బురద.. ఏ రహదారి చూసిన బురదమయమే.. వరదకు కొట్టుకొచ్చిన దుంగలు.. కరెంటు తీగలపై బట్టలు..సగం కూలిపోయిన ఇళ్లు..ఏ ఒక్కరిని కదిలించిన కన్నీటి కష్టాలే.. గోదావరి శాంతించడంతో బయటపడుతున్న లంకలోని పరిస్థితి ఇది. ఇళ్లల్లోకి చేరిన మట్టిని తొలగించుకునే పనిలో బాధితులు నిమగమయ్యారు. పూర్తిగా బురదమయమైన వస్తువులను ఒక్కొక్కటిగా శుభ్రం చేసుకుంటున్నారు. ఏ వస్తువు కింద ఏ పాము దాగి ఉందోనని భయం భయంగా శుభ్రం చేస్తున్నారు. కాకినాడ జిల్లా నుంచి వచ్చిన శానిటేషన్‌ సిబ్బంది వీధుల్లోని బురదను తొలగించి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. ఆలమూరు మండలం బడుగువాని లంక, ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, పి.గన్నవరం మండలం లంకల గన్నవరం, రాజోలు మండలం రాజోలు లంకలో ఇళ్లకు ఎక్కువగా నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ప్రాంతాల్లో సుమారు 120 ఇళ్ల వరకూ నష్టం వాటిల్లినట్టు అంచనా.ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వరద ముంపు తగ్గడంతో గ్రామాలకు చేరుతున్న ప్రజలు అక్కడి పరిస్థితులను చూసి పెడుతున్న రోదనలు మిన్నంటుతున్నాయి. వరద ధాటికి ఇళ్లు కుప్పకూలడంతో నిలువనీడ లేకుండాపోయారు. ఇళ్లలోని సామాన్లు మొత్తం దెబ్బతినడంతో సర్వంకోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధితులు ఘొల్లుమంటున్నారు. ఈ రెండు మండలాల్లోని 125 గ్రామాలు తీవ్ర వరద ఉధృతికి గురయ్యాయి. వీటిలో అత్యధిక గ్రామాల్లో ఇంటి పైకప్పులు సైతం మునిగిపోయాయి. సామాన్లన్నీ ఇళ్లలోనే వదిలి కట్టుబట్టలతో 20,248 కుటుంబాలు పునరావాస కాలనీలకు చేరాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ఆయా గ్రామాలన్నీ వరద ముంపు నుంచి బయటపడుతున్నాయి. గ్రామాలకు వెళ్తున్న ప్రజలు అక్కడి పరిస్థితి చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. రోడ్లపై మోకాళ్లలోతు బురద, కుప్పకూలిన తమ ఇళ్లను చూసి రోదిస్తున్నారు. ఇంట్లో సామాన్లు సైతం ఎందుకూ పనికిరాని స్థితికి చేరాయి. మోటారు సైకిళ్లు, టివిలు, ఫ్రిజ్‌లు, విద్యుత్తు మీటర్లు, పరుపులు ఇలా ఏఒక్క సామగ్రి పనికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కుక్కునూరులోని రజక బజార్‌లో 120 ఇళ్లకుగానూ పది ఇళ్లు మాత్రమే మిగిలాయి. మిగిలిన ఇళ్లన్నీ కుప్పకూలిపోయాయి. బెస్తగూడెం ఎస్‌సి కాలనీలో సైతం పెద్ద ఎత్తున ఇళ్లు పడిపోయాయి. వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము, కొయిదా, కట్కూరు గ్రామాల్లోనూ 90 శాతానికిపైగా ఇళ్లు పడిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుత ధరల నేపథ్యంలో చిన్నపాటి తాటాకు ఇంటిని నిర్మించాలన్నా రూ.50 వేలకుపైగా ఖర్చవుతుంది. రోడ్లపై పెద్ద ఎత్తున బురద పేరుకుపోవంతో గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి ఇప్పటికీ లేకుండా ఉంది. కుక్కునూరులోని జూనియర్‌ కాలేజీ, కస్తూబా బాలికల హాస్టల్‌ పునరావాస కేంద్రాల్లోని బాధితులను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇళ్లు కుప్పకూలిపోవడంతో గ్రామాల్లోకి వెళ్లి ఎక్కడ ఉండాలో తెలియని దిక్కుతోచని దుస్థితిలో బాధితులు ఉన్నారు. రేకుల షెడ్లు, పెంకుటిళ్ల్లు, డబ్బాలు వంటి ఇళ్లు కూలకపోయినా వరద నీటికి నానిపోవడంతో గోడలన్నీ దెబ్బతిన్నాయి. ఇళ్లలో భారీగా పేరుకుపోయిన బురదను తొలగించేందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చయ్యే పరిస్థితి ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పకూలిన ఇళ్ల ఎన్యుమరేషన్‌ వెంటనే పూర్తి చేసి నష్టపరిహారం అందిస్తేనే వరద బాధితులకు ఊరట లభిస్తుంది. లేదంటే పిల్లలతో అంతా రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారంపై ప్రభుత్వం ఇప్పటివరకూ నోరు మెదపలేదు.

Related Posts