YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హోర్డింగ్స్ వార్

హోర్డింగ్స్ వార్

గుంటూరు, జూలై 26,
గుంటూరు నగరపాలక సంస్థలో భారీగా వెలుగుచూస్తున్న హోర్డింగ్‌లు అధికారులు.. మున్సిపల్ కార్పొరేటర్ల మధ్య చిచ్చుపెట్టాయి. 12 ఏళ్లు అధికారుల పాలన సాగడంతో.. నగరంలో ఇష్టానుసారం హోర్డింగులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో పెద్దగా చర్చ సాగింది లేదు. కానీ.. ఎన్నికలు జరిగి.. కొత్త కౌన్సిల్‌ వచ్చాక.. వాటికి సంబంధించిన ప్రకంపనలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు గతంలో జరిగిన అక్రమాల పుట్టను వెలికి తీస్తున్నారు. అలా హోర్డింగ్‌లపై ఫోకస్‌ పెట్టారట.గుంటూరు నగరంలో అక్రమ హోర్డింగ్‌లు ఎన్ని ఉన్నాయి? వాటి ద్వారా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎంత రావాలి? ఎంత వస్తోంది? ఎన్ని నిధులు పక్కదారి పట్టాయి? ఇలా చాలా అంశాలను వెలికి తీశారట వైసీపీ కార్పొరేటర్లు. హోర్డింగ్‌ల ద్వారానే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారట. ఆ బిజినెస్‌ ఏదో మనమే చేస్తే పోలా అని అందరికీ ఆశ పుట్టిందట. వెంటనే అధికార పార్టీ నేతల ముందు ఆ ప్రతిపాదన ఉంచారట కార్పొరేటర్లు. వాటి నిర్వహణ బాధ్యత కార్పొరేషన్‌ తీసుకుని.. బాధ్యతలు కార్పొరేటర్లకు అప్పగిస్తే.. ప్రైవేట్‌ కంపెనీలతోపాటు… ప్రభుత్వ పథకాలను కూడా ప్రచారం చేయొచ్చుని సెలవిచ్చారట. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్‌ మనోహర్‌తోపాటు కమిషనర్‌కు ఈ విషయం చెప్పారు. అయితే నిర్వహణ విషయంలో ఎక్కడా అధికారుల పాత్ర ఉండొద్దని కండీషన్‌ పెట్టారట.ఇప్పటికే చాలా మంది అధికారులు హోర్డింగ్‌ల ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనేది కార్పొరేటర్ల ఆరోపణ. అధికారిక లెక్కల ప్రకారం గుంటూరులో దాదాపు 900ల హోర్డింగ్‌లు ఉన్నాయి. అనధికారికంగా వీటి సంఖ్య 8 వేల 500 వరకు ఉంటుందని సమాచారం. ఆ లెక్కలు తెలిశాక వైసీపీ కార్పొరేటర్లు కళ్లు తేలేసారట. లెక్కల్లో చూపించకుండా ఉన్న హోర్డింగ్‌ల ద్వారా వచ్చిన ఆదాయం ఎవరు మింగేశారో కూపీ లాగుతున్నారట. గడిచిన పదేళ్ల లెక్క తీసుకుంటే కోట్లకు కోట్లే వెనకేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారట. అధికారులు.. ఆ విభాగంలో పనిచేస్తున్న.. పదేళ్లుగా పనిచేసిన సిబ్బంది లెక్కలు దగ్గర పెట్టుకుని ఎవరికెంత వాటా వెళ్లిందో టేబుల్స్‌ వేస్తున్నారట. చివరకు హోర్డింగ్‌ల ఎత్తు విషయంలోనూ కొందరు ఆఫీసర్లు, సిబ్బంది జిమ్మిక్కులు చేశారని గుర్తించారట.మొత్తానికి తేనెతుట్టెను కదిపినట్టు సంతోష పడుతున్నారు కార్పొరేటర్లు. వాటిని పక్కాగా నిర్వహిస్తే.. కార్పొరేషన్‌కు నిధులు.. తమకూ మిగులు అనేట్టుగా కొందరు నేతల ఆలోచనలు ఉన్నాయట. పైకి గుంటూరు మున్నిపల్ కార్పొరేషన్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అని చెబుతున్నా.. లీడర్ల తీరు చూస్తే అలా లేదన్నది సిబ్బంది మాట. అప్పుడు మీరు తిన్నారు.. ఇప్పుడు మా వంతు అన్నట్టు కొందరి వైఖరి ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి నగరంలో బొమ్మ బొమ్మకో రేటు కట్టి కొత్త పంచాయితీకి తెరతీస్తారేమో చూడాలి.

Related Posts