విజయవాడ, జూలై 28,
చంద్రబాబు రాజకీయ వ్యూహంలో దిట్ట. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలోకి తిరిగి వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇటు ప్రధాన మీడియా మద్దతు చంద్రబాబుకు ఉండనే ఉంది. ప్రజల్లో హైప్ తీసుకురావాల్సి ఉంది. అది ఒక్క ఆయన అనుకూల మీడియా వల్లనే సాధ్యం కావడం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ మీడియాలో వచ్చిన కథనాలను కూడా ఎవరూ విశ్వసించడం లేదు. వైఎస్ హయాం నుంచి జగన్ వరకూ సక్సెస్ ఫుల్ గా ఆ మీడియా పై వేసిన బాబు అనుకూల ముద్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇక ప్రజల్లో హైప్ తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఇందుకు మీడియా ప్రచారం ఒక్కటే సరిపోదు. ప్రజల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఊపు తేవాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు వైసీపీలో అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నట్లే కనపడుతుంది. ఎన్నికలు దగ్గర పడే సమయంలో వైసీపీని మానసికంగా బలహీనపర్చాలన్నా, క్యాడర్ లో మరింత ఉత్సాహపర్చాలన్నా గతంలో దూరమయిన నేతలతో పాటు, వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను చంద్రబాబు పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. తనపై పరుష పదజాలంతో దూషించిన వారినైనా రాజకీయం కోసం చంద్రబాబు అక్కున చేర్చుకుంటారు. అలాగే ఇప్పుడు మోహన్ బాబుతో మొదలయిందంటున్నారు. మోహన్ బాబుకు, చంద్రబాబుకు దాదాపు పదేళ్ల నుంచి రాజకీయ వైరం నడుస్తుంది. అనేక సార్లు మోహన్ బాబు చంద్రబాబును దూషించారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. కానీ రాజకీయ అవసరం మోహన్ బాబును దగ్గరకు చేర్చింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న చంద్రబాబు తొలుత సినిమా పరిశ్రమలో తనకు శత్రువులు, వైసీపీికి మిత్రులైన వారిని దగ్గర చేర్చుకుంటున్నారు. బాలకృష్ణ మధ్యవర్తిత్వం చేసి మోహన్ బాబును చంద్రబాబు ఇంటికి వచ్చేలా చేశారు. అందులో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మోహన్ బాబుకు జనంలో పెద్దగా ఆదరణ లేకపోయినా ఒక వాయిస్ తనకు తోడు దొరికినట్లేనని భావిస్తున్నారు. తాను సాయిబాబా గుడి ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి వెళ్లినట్లు మోహన్ బాబు చెబుతున్నా దానికే అయితే రెండు గంటల పాటు చర్చలు దేనికన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక రాజకీయ నేతలకు కూడా త్వరలో చంద్రబాబు గాలం వేస్తారని తెలిసింది. ముఖ్యంగా వైసీపీలో మంత్రి పదవి దక్కని అనేక మంది సీనియర్ నేతలున్నారు. వారు అసంతృప్తితో ఉన్నారు. కానీ ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కిల్లి కృపారాణి, నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి, కర్నూలు జిల్లాలో బుట్టా రేణుక, ఎస్వీ మోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లాలో మానుగుంట మహీధర్ రెడ్డి, గుంటూరు జిల్లాలో కొందరు వైసీపీ నేతలను పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ద్వితీయ శ్రేణి నేతలు కాకుండా వైసీపీలో అగ్రనేతలను పార్టీలోకి రప్పించుకుని జగన్ ను మానసికంగా దెబ్బతీయాలన్న ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది చూడాల్సి ఉంది.