కడప, జూలై 28,
ప్రజలు ఉలిక్కిపడిన సంఘటన జరిగితే దానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు కారకులను పట్టుకోవ డం, శిక్షించడం అన్నీ క్షణాల్లో జరిగిపోతుండటం చూస్తుంటా. వాస్తవంలో కాదు.. సినిమాల్లో మాత్రమే. వాస్తవంలో అదేమీ జరగదు, పైగా రాజకీయకోణం ఉన్న హత్య కేసులైతే దోషులను నిర్ధారించడం, పట్టుకోవడం చాలా చాలా ఆలస్యం అవుతుంది. కానీ. వై.ఎస్.వివేకా నందరెడ్డి కేసులో మాత్రం ఆ జాప్యానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. మరో వంక ఈ కేసు విషయంలో దోషులను ఎలగైనా పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్న వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చి, కేసు గురించి మరిచిపోయేలా చేసి తన రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకోవాలన్న కొత్త ఎత్తుగడ ఒకటి జగన్ వేస్తున్నారని తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడున్నరేళ్లు గడుస్తోంది. సరిగ్గా 2019 ఎన్నికల హడావుడిలో ఉండ గా మార్చిలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పటికీ ఆ కేసు తేలలేదు. ప్రతిపక్షాలో, వివే కానంద కుమార్తె సునీతో, మరెవరయినానో ఢిల్లీ వెళ్లడమో, ప్రశ్నించడమోచేస్తేనే కేసు మళ్లీ చర్చకు వస్తోం ది. అంతే తప్ప విచారణలో అడుగు ముందుపడటం లేదు. వివేకానంద రెడ్డి స్వయాన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి బాబాయి అయినప్పటికీ ఈ కేసు నత్తనడకన సాగడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారే ఈ ఘాతుకానికి పాల్పడిందంటూ జగన్, ఆయన అనుచరగణం ఊరూ వాడా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఈ కేసు విచారణ విషయంలో ఆస క్తి చూపడం లేదన్న విమర్శలు వచ్చాయి. పైగా వివేకానంద హత్య, విచారణలో జాప్యం అప్పటి రాజకీయ పరిణామాలు జగన్‌కి బాగా కలిసివచ్చాయి. ఈ కారణంగానే చంద్రబాబుకు ఎంతో నష్టం జరిగింది. సానుభూతి ఓటుతో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి కాగానే ముందుగా ఈ కేసు సంగతి తేల్చే స్తారని ఆయన కుటుంబం కూడా భావించింది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అప్పటివరకూ ఈ కేసుపై సిబిఐ విచారణకు జగన్ డిమాండ్ చేశారు. కానీ అధికారంలో కి వచ్చాక దాన్ని మరింత వేగిరం చేయాల్సింది బోయి అసలు సీబీఐ దర్యాప్తే అనవసరం అని తేల్చేరు. కానీ వివేకా కుమార్తె వదల్లేదు కోర్టును ఆశ్రయించి మరీ వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టేలా చేయగలిగారు. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి ఈ కేసు విచారణను వేగి రం చేయాలని, హత్యకు పాల్పడినవారిని పట్టుకోవాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంతేగాక సోద రుడు జగన్ హయాంలో విచారణపై తనకు నమ్మకం లేదని ఆమె అన్నారు. ఈమేరకు సుప్రీం కోర్టు ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆదేశించింది. ఇక జగన్ అక్కడ నుంచి సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డు తగిలే విధంగానే వ్యవహరించారు. సీబీఐ అధికా రుల వాహనాల మీద కడపలో దాడి జరిగినా పట్టనట్టే వ్యవహరించారు. ఈ పరి ణామాలు జగన్ మీదనే అనుమా నాలు కలిగేలా చేశాయి. ఎందుకంటే సీబీఐ దర్యాప్తు ఈ కేసులో జగన్ సంబంధీకుల వైపే వేలెత్తి చూపేదిగా ఉంది. జగన్ సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ సహా పలువురు జగన్ అస్మదీయులకు ఈ కేసులో సంబంధం ఉందన్నఅనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా క్రమంగా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కూడా నత్తతో పోటీపడి నడుస్తుండటంతో సోదరుడు సీఎం అయినా ఈ కేసు విషయంలో అడ్డంకులు సృష్టించి దర్యాప్తు ముందుకు సాగకుండా చేస్తున్నారని సునీత ఆరోపిస్తున్నారు. అసలే ఈడీ తో ఇబ్బందులు, రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ అస్థిరతతో తలమునకలౌతున్న జగన్ ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు జగన్ కొత్త ఎత్తుగడ వేశారని పరిశీలకులు అంటున్నారు. వివేకా కుమార్తె, తన సోదరి సునీతను శాంతపరచడం ద్వారా దీని నుంచి బయటపడాలని ఆయన భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో పులి వెందుల సీటు సునీతకు ఆఫర్ చేశారు. ప్రతిగా వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు ఇక ప్రయత్నాలు చేయకూడదన్న షరతు విధించారని అంటున్నారు. అందుకు ఆమె అంగీకరిస్తే పులివెందుల టికెట్ ఆమెకు ఇచ్చి తాను జమ్మల మడుగు నుంచి రంగంలోకి దిగడానికి సిద్ధపడ్డారంటున్నారు. అయితే, తల్లి విజయలక్ష్మిని పార్టీ గౌరవ అధ్యక్షపదవి నుంచి దించేసి చెల్లి షర్మిల వద్దకు పంపిన జగన్ అవసరం తీరాక తననూ అలాగే కరివేపాకులా తీసిపడేసే అవకాశం ఉందని డాక్టర్ సునీత భావిస్తుండటంతో జగన్ ప్రతిపాదనకు ఆమె ఓకే చెప్పలేదని పులివెందులలో ఓ స్థాయిలో చర్చ జరుగుతోంది.