విజయవాడ, జూలై 28,
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఏ గడపకు వెళ్లినా చెత్త పన్నుపై నిరసనలు, విమర్శలు ఎదురౌతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. చెత్త పన్నుపై ప్రజాగ్రహాన్ని గమనించిన ఆయన తన నియోజకవర్గంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. అయితే మంత్రిగా ఉండగా ఆయన మాటే శిరోధార్యంగా పరుగులు పెట్టిన అధికారులు మాజీ అయిన తరువాత ఆయన మాటను కాదు కదా.. ఆగ్రహాన్నీ, హుంకరింపునూ కూడా పట్టించుకోవడం లేదు. మీరేమన్నా సరే మా పని మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చెత్త పన్ను వసూలు వద్దని ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలను అధికారులు అసలే లెక్క చేయలేదు. పైపెచ్చు ప్రజల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఈ నెల చెత్త పన్ను వసూలు టార్గెట్ ను అధికారులు ఇప్పటికే దాదాపు పూర్తి చేసేశారు. దీంతో కొడాలి నానికి గడప గడపలోనూ చెత్త పన్ను సెగే తగులుతోంది.తాను చెప్పినా అధికారులు వినకపోవడంతో ఆయనకు ఆగ్రహం వచ్చింది. ప్రజల ఎదురుగానే అధికారులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసి జనం వద్ద మంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నించారు. అయినా జనం నమ్మడం లేదు. మాజీ అయిన మీ మాట అధికారులు ఎందుకు వింటారు సార్ అని సెటైర్లు వేస్తున్నారు. అదే విధంగా అధికారులు కూడా ఒక ఎమ్మెల్యే మాట విని ప్రభుత్వ ఆదేవాలను నిర్లక్ష్యం చేయలేమని అదే ప్రజల ఎదుటే నానీకి అధికారులు స్పష్టంగా చెప్పేశారు.దీంతో ఈ విషయంలో సీఎంతోనే తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తాను తాడో పేడో తేల్చుకోవలసింది ముఖ్యమంత్రితో అవ్వడంతో తానొక్కడి వల్లా కాదని అనుకున్నారేమో బందర్ మాజీ మంత్రి పేర్ని నాని సహాయం తీసుకోదలిచారు. అందుకు పేర్ని నాని సైతం సై అన్నారని అంటున్నారు. అయితే వీరిద్దరూ అనుకుంటే సరిపోతుందా? పవర్ లేని మాజీలాయె. అసలు సీఎం జగన్ వీరికి అప్పాయింట్ మెంటైనా ఇస్తారా అని గుడివాడలో వైసీపీ శ్రేణులే అంటున్నారు. చెత్త పన్ను విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు సరే సరి.. కానీ పన్నుపై ప్రజాగ్రహం మాత్రం నేరుగా ఎమ్మెల్యేలపైనే వ్యక్తం అవుతోంది. ఇది తెలిసినా జగన్ పట్టించుకోవడం లేదు. మీ బాధలు మీరు పడండి. బటన్ నొక్కి జనం ఖాతాల్లో వేలకు వేలు వేస్తుంటే.. ఆ మాత్రం చెత్త పన్నుపై వారిని కన్విన్స్ చేయలేకపోతే మీరెందుకు? అని విసుక్కుంటున్నారని, ఇప్పటికే నియోజవర్గంలో ఎదురౌతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళదామని ప్రయత్నించి భంగపడ్డ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి ఈ మాజీలకు చెత్త పన్ను విషయంలో సీఎం వద్ద ఎలాంటి మర్యాద దక్కుతుందో చూడాలి. దానికి ఆయనేమన్నారో స్పష్టత లేదు. కానీ చెత్తపన్నుపై మాత్రం నానీల ఉద్యమం ప్రారభమయిందంటున్నారు. చెత్తపన్ను విషయంలో ప్రభుత్వానికి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో వైసీపీ ప్రజాప్రతినిధులకు బాగా తెలుసు. మామూలుగా అయితే ఇలాంటి పన్నులు చెల్లించిన వారి దగ్గరే తీసుకుంటారు. కానీ ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త వేయండన్న హెచ్చరికలు కూడా ధర్మాన వంటి మంత్రులు చేశారు. ఇవన్నీ సీఎంకు తెలియక కాదు. మరి ఇప్పుడు నానీలు చెప్పినంత మాత్రాన సీఎం జగన్ చెత్తపన్ను రద్దు చేస్తారా అన్నది వైసీపీలో హాట్ టాపిక్ !